తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌కు రూ.150 కోట్లతో గేట్లు - జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌లోకి పెద్దఎత్తున వచ్చిన వరద నీటితో కాలనీలు మునిగిపోయాయి. సాగర్‌లోని వరదనీటిని బయటకి పంపించేందుకు ప్రభుత్వం ప్రణాళికా తయారుచేసింది. ఇందుకోసం 150 కోట్లతో భారీ వరద గేట్లు అమర్చనుంది. వరద నీటిని గేట్ల ద్వారా దిగువకు వదలనుంది. సంబంధిత డిజైన్‌ వారం రోజుల్లో ఖరారుచేసి... టెండర్‌ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Hussain Sagar Gates to at a cost of Rs 150 crore
హుస్సేన్‌సాగర్‌కు రూ.150 కోట్లతో గేట్లు

By

Published : Dec 10, 2020, 5:09 AM IST

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చి ముంపు సమస్య ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు పెద్ద ఎత్తున వరదనీరు చేరే హుస్సేన్‌సాగర్‌పై... నీటిపారుదల శాఖ అధికారి మురళీధర్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వం కమిటీ నియమించింది. పలు ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసిన ఈ కమిటీ... ఉన్నతాధికారులతో సమావేశమై...150 కోట్లతో వరద గేట్లు అమర్చాలని నిర్ణయించింది.

ప్రవాహం వచ్చినప్పుడు

హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా... రిజర్వాయర్‌లో ఎప్పుడూ నీరు ఉంటుంది. భారీ వర్షాలు పడి ప్రవాహం వచ్చినప్పుడు అదనపు నీరు అలుగు మీదుగా బయటకి వెళ్తుంది. ఈ సమయంలో కొంతనీరు వెనక్కి తన్ని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాలను ఖాళీ చేయించడం సాధ్యం కాదు కాబట్టి... దిగువకు ఎక్కువ ప్రవాహం పంపించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం మారియట్‌ హోటల్ వద్ద ఉన్న అలుగును మూడు మీటర్లు వరకు తొలగించి... గేట్లు అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజైన్‌ పూర్తయితే ఎన్ని గేట్లు ఏర్పాటు చేయవచ్చు. వాటి ఎత్తు ఎంతుంటుంది. ఎంతనీటిని బయటకి వదలవచ్చు తదితర సాంకేతిక అంశాలన్నీ ఖరారవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మురుగునీటి శుద్ధికేంద్రాలు

జీహెచ్​ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా... ఇందులో గొలుసుకట్టు చెరువులు 80 నుంచి 90 ఉన్నాయి. బాహ్య వలయ రహదారి లోపల 455 చెరువులున్నాయి. ఇటీవల వరదల దృష్ట్యా వాటి అభివృద్ధి పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం 19 చెరువుల వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలున్నాయి. దీంతో మిగతా చెరువుల్లోకి మురుగునీరు చేరుతోంది. మొదటగా మరో 31 చెరువుల వద్ద మురుగునీటి శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో 17 ఎస్టీపీల నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. మిగతా ఎస్టీపీల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు చెప్తున్నారు. పది రోజుల తర్వాత మరోసారి సమావేశమై అధ్యయనాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి :లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం

ABOUT THE AUTHOR

...view details