కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా గత నెల 24 నుంచి విద్యాసంస్థలు మూసేశారు. మళ్లీ తెరుస్తారో.. లేదోనన్న అయోమయం.. పూర్తికాని పాఠ్యాంశాలు తదితర ఇబ్బందుల నడుమ పదో తరగతి పరీక్షలు ఎలా రాయాలనే ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సందిగ్ధంతో ఉన్నారు. డిజిటల్ తరగతుల ద్వారా బోధన సజావుగా సాగకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
వచ్చే నెల 17 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించి టైం టేబుల్ని విడుదల చేసింది. విద్యాసంస్థలు మూతపడడం వల్ల కేవలం డిజిటల్ తరగతులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి 9, 10 తరగతులకు ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతి గది బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. నెలన్నరపాటు కొనసాగించింది. తొలుత విద్యార్థుల హాజరు సరిగా లేకపోవడం వల్ల బోధన సరిగా సాగలేదు. ఆ తరవాత ఊపందుకున్నా తగినన్ని రోజులు తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 33,350 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు విభాగంలో 1,08,768 మంది విద్యార్థులున్నారు.
అసంపూర్తిగా సిలబస్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో ఐదు రోజులపాటు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ పాఠాలు ప్రసారమవుతున్నాయి. ఈ పాఠాలు చూసే విషయంపై తొలుత ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ, అనంతరం అది కాస్తా కొరవడింది. పదో తరగతిలో 70 శాతం మాత్రమే పాఠాలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. డిజిటల్ తరగతుల్లో 50-60 శాతం పూర్తయ్యిందని చెబుతోంది. 40-50 శాతం మాత్రమే పూర్తయ్యిందని ఉపాధ్యాయులు అంటున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో బోధన కారణంగా సిలబస్ పూర్తయింది. సర్కారీ బడుల్లో పూర్తిచేసిన 50 శాతం సిలబస్‌తో పరీక్షలు రాయడమెలాగని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యక్ష బోధన అనుమానమే!
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడం అనుమానమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రత్యక్ష బోధన ఎంతవరకు సాగుతుందనేది అయోమయంగా మారింది. ఇప్పటివరకు కేవలం ఎఫ్‌ఏ-1 (ఫార్మేటివ్ అసెస్‌మెంట్) మాత్రమే పూర్తయింది. దీనికి విద్యార్థులు చాలా మంది హాజరు కాలేదు. ‘‘మే 17 నుంచి పరీక్షలు నిర్వహించకపోతే మే నెలాఖరుకు వాయిదా పడే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఇంటర్ పరీక్షలు ఉన్నందున ప్రభుత్వం వాటిని నిర్వహిస్తుందా.. లేదా తెలిస్తే పది పరీక్షలపైనా స్పష్టత వస్తుంది’’ అని ప్రధానోపాధ్యాయుడు ఒకరు తెలిపారు.
అభ్యాసన దీపిక అందిస్తున్నాం