ఆరేడేళ్ల కిత్రం వరకు ఆర్థికంగా దేశంలో ముంబయి తరువాతి స్థానం బల్దియాదే. రూ.5 వేల కోట్ల డిపాజిట్లు బ్యాంకులో ఉండేవి. క్రమేపీ వాటిని ఖర్చు చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలైంది. నెలవారీ వసూలయ్యే ఇంటి పన్నే ఆధారమైంది. వసూలు నిల్చిపోతే ఆ ప్రభావం ఉద్యోగుల జీతాల చెల్లింపుపై పడుతోంది. ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండడంలేదు. రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టిన గుత్తేదారులకు రూ.500 కోట్ల మేర చెల్లింపులు నిలిపేయడంతో పనులు నిలిపేశారు. నెలవారీ వసూలయ్యే ఆస్తి పన్ను జీతాలు, నిర్వహణ ఖర్చులకే సరిపోతోంది. వెరసి ఖజానాలో పైసా ఉండడంలేదు.
ఏం చేద్దాం..
ఆదాయం పెరిగేందుకు ఆస్తి పన్నును పెంచేందుకు అనుమతివ్వాలని గత నాలుగైదేళ్లుగా బల్దియా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ సర్కార్ ఆమోదముద్ర వేయలేదు. 15 ఏళ్లలో ఇప్పటి వరకు ఆస్తి పన్ను పెంచలేదని చెప్పారు. 5 శాతం పెంపునకు అవకాశం ఇచ్చినా, రూ.1500 కోట్లకు పైగా అదనంగా సమకూరుతుందని భావిస్తున్నారు. ఏటా కొన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టొచ్చని చెబుతున్నారు. ఎన్నికలన్నీ ముగిసిన నేపథ్యంలో సర్కార్ అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.