తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో ఆధారాల వేట.. కేరళ వైద్యుడి ప్రమేయం..!

SIT Inquiry on MLAs Bribing Case: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ వరుస సోదాలు నిర్వహిస్తోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, ఆశ్రమాల్లో రెండురోజులుగా తనిఖీలు కొనసాగాయి. శనివారం మొదలైన సోదాలు ఆదివారం రాత్రి వరకు జరిగాయి. తనిఖీల కోసం ఇందుకోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, హరియాణలోనూ తనిఖీలు నిర్వహించాయి. కేరళలో ఓ వైద్యుడి ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు.. కేసుతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

Special Investigation Team
Special Investigation Team

By

Published : Nov 14, 2022, 8:08 AM IST

Updated : Nov 14, 2022, 9:35 AM IST

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో ఆధారాల వేట.. కేరళలో ఓ వైద్యుడి ప్రమేయం..!

SIT Inquiry on MLAs Bribing Case : పార్టీ మారడానికి తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సోదాల పరంపర కొనసాగుతోంది. కీలక నిందితుడు రామచంద్రభారతికి సంబంధించి హరియాణ రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లోని నివాసంతో పాటు కర్ణాటకలోని పుత్తూరులో పోలీసులు తనిఖీలు చేశారు. కర్ణాటక, హరియాణా, ఏపీ, హైదరాబాద్‌లో సిట్ అధికారుల సోదాలు ముగిశాయి. ప్రస్తుతం సిట్ కేరళలో సోదాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వ్యవహారానికి సంబంధించి, కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది.

MLAs Bribing Case Update : ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినప్పుడు, కేరళకు చెందిన తుషార్‌తో రామచంద్రభారతి ఫోన్‌లో మాట్లాడించారు. తుషార్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని మాట్లాడించారు. ప్రలోభాల పర్వంలో తుషార్‌ పాత్ర ఏంటనే అంశంపై, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ వైద్యుడి ప్రమేయాన్నిపోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

TRS MLAs Bribing Case News : ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఆ వైద్యుడే తుషార్‌ను, రామచంద్రభారతికి పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని నిర్ణయించారు. తుషార్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేరళ వైద్యుడి గురించి సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలో సోదాలు సాగిస్తున్నారు. అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న వైద్యుడు పరారైనట్లు సమాచారం. పోలీసులు వస్తున్నట్లు వైద్యుడికి ఆశ్రమ పర్యవేక్షకుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కేరళ పోలీసుల సాయంతో సిట్ అధికారులు పర్యవేక్షకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వైద్యుడికి సంబంధించిన విషయాలు ఆరా తీశారు.

సింహయాజికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆశ్రమంలో తనిఖీలు కొనసాగాయి. గత నెల 26న మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో కుట్ర బయటపడిన రోజు.. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చేందుకు విమానటికెట్‌ను బుక్‌ చేసింది ఓ ప్రజాప్రతినిధి బంధువుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో అందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై, సిట్‌ దృష్టిసారించింది.

సింహయాజిని ప్రముఖ స్వామీజీగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులకు నందకుమార్‌ పరిచయంచేసినట్లు పోలీసులు గుర్తించారు. సింహయాజివద్ద ఆశీర్వాదంతీసుకుంటే మంచి జరుగుతుందని ప్రచారం చేసినట్లు భావిస్తున్న నేపథ్యంలో, రాజకీయనేతలతో సింహయాజికి ఉన్న సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. నందకుమార్‌కి సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

కేసు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని.. రోహిత్‌రెడ్డి, బాలరాజు, హర్షవర్ధన్‌ రెడ్డి, రేగా కాంతారావు వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై 506 సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 14, 2022, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details