ఆంధ్రప్రదేశ్లో విశాఖలోని కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో.. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు.
వేలాది ఎకరాల భూములను దోచుకునేందుకే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఏ పరిశ్రమకైనా భూములు కేటాయిస్తే వారు అమ్ముకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు.. చిత్తశుద్ధితో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడితే రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడినట్టేనని వ్యాఖ్యానించారు. పోస్కో.. విశాఖ రావడానికి వీల్లేదన్నారు.