"పుట్టిన ఊరికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం" ఇదీ.. మహేశ్ బాబు నటించిన "శ్రీమంతుడు" చిత్రంలోని డైలాగ్. దీన్ని నిజజీవితానికీ అప్లై చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్. తన స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహేశ్ తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో.. ఎన్నో మౌలిక వసతులు సహా కరోనా వ్యాక్సినేషన్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. ఆయన ఆలోచనకు తోడు.. స్థానికులు చైతన్యంతో ముందుకు రావటంతో.. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా బుర్రిపాలెం నిలిచింది.
కరోనా మహమ్మారిని నిలువరించే పోరులో.. మనదేశం వందకోట్ల టీకా డోసుల అరుదైన మైలురాయిని దాటింది. ఇలాంటి ఘనత సాధించిన సమయంలోనే.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామం సైతం వందశాతం వ్యాక్సినేషన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. తెనాలి మండలంలోని ఈ గ్రామంలో అర్హులైన వారందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచనతో.. తన సొంత ఖర్చుతో పాటుగా ఆంధ్ర హాస్పటల్ వారి సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహేశ్ బాబు ఏర్పాటు చేశారు.
" గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని హీరో మహేశ్ బాబు ఆయన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అర్హులైన అందరికీ వందశాతం వ్యాక్సిన్ వేయించారు. ఇందుకు అందరూ సహకరించారు. మహేశ్ బాబుకు మా ధన్యవాదాలు." -అన్నాబత్తుని జయలక్ష్మీ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు.
" బుర్రిపాలెం గ్రామస్థులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. ఇందుకు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు, ఆంధ్ర హాస్పిటల్స్ వారు అందరూ ఎంతో సహకరించారు. " -లలిత ప్రసాద్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు.