Human Trafficking And Missing Children Report : రాష్ట్రంలోమానవ అక్రమ రవాణా సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రాష్ట్రంలోని బాలల పరిశీలక గృహాలపై న్యాయసేవాధికార సంస్థ ఇవాళ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అధీనంలో చైల్డ్ హోంలు లేవని.. స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్నాయని నివేదికలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వివరించింది.
Missing Children Report in High Court : బాలల పరిశీలన గృహాల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. నివేదికను పరిశీలించి డీజీపీ, ప్రభుత్వ న్యాయవాది తదుపరి విచారణలో స్పందన తెలపాలని హైకోర్టు ఆదేశించింది. మానవ అక్రమ రవాణా అనేక దేశాల్లో అతి పెద్ద నేరంగా ఉందని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా డ్రగ్స్, వన్యప్రాణులు, మానవ రవాణ అక్రమ వ్యాపారం ఎక్కువగా ఉందని తెలిపింది. మానవ అక్రమ రవాణాను నియంత్రించడంతో పాటు బాధితులను రక్షించి పునరావాసం కల్పించి వారిని సమాజంలో మళ్లీ మమేకం చేయడం ముఖ్యమని హైకోర్టు పేర్కొంది.
Human Trafficking Report On High Court : సున్నితమైన ఈ అంశంపై దర్యాప్తు, న్యాయ అధికారుల్లోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ధర్మాసం పేర్కొంది. మానవ అక్రమ రవాణ నియంత్రణకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. కోర్టులకు పరిధులు ఉంటాయని.. సమాజంలోని అన్నింటినీ సరిచేయలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్లపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇస్తామంటూ జులై 20కి వాయిదా వేసింది.