హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా 3000 ఎంఎం వ్యాసార్ధంతో భారీ పైపులైన్‌ను 158 కిలోమీటర్ల అవుటర్ చుట్టూ నిర్మించాలని గతంలో జలమండలి అధికారులు నిర్ణయించారు. ఔటర్ చుట్టూ ఐటీ కంపెనీలు, సెజ్‌లు, భారీ వెంచర్లు వస్తుండటంతో ఈ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చనుంది. ఈ భారీ పైప్‌లైన్‌కు నగరానికి నీటిని అందించే అన్ని వ్యవస్థలను అనుసంధానం చేయనున్నారు. త్వరలో నిర్మించనున్న కేశవాపురం, దేవులమ్మనాగారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను సైతం ఈ లైన్‌కు లింకు చేస్తారు. కరెంటు సరఫరా వ్యవస్థను అనుసంధానం చేసే గ్రిడ్ మాదిరిగా.. ఇలా నగర తాగునీటి వ్యవస్థను గ్రిడ్‌లా కలపనున్నారు. ఫలితంగా ఏ వైపు నుంచైనా నగరానికి తాగునీటిని అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు.
రింగ్‌మెయిన్‌లో కీలకాంశాలు...
*ఈ ప్రాజెక్టుకు గతంలో రూ.4,765 కోట్లు ఖర్చు అవుతుందని జలమండలి తేల్చింది. అయితే పెరిగిన ధరలు పరిగణనలోకి (ఎస్‌ఎస్‌ఆర్) తీసుకుంటే రూ.5,376 కోట్లు వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
*నగరానికి కృష్ణా, గోదావరి, మంజీరా, జంటజలాశయాల నుంచి నిత్యం 460 మిలియన్ గ్యాలన్ల వరకు సరఫరా చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ప్రధాన పైపులన్నీ అవుటర్ రింగ్ రోడ్డు దాటి నగరంలోని రిజర్వాయర్లకు చేరుతున్నాయి.
*ప్రస్తుతం అవుటర్ రోడ్డు చుట్టూ ప్రధాన రియల్ సంస్థలన్నీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో తాగునీటి డిమాండ్ రెండు మూడు రెట్లు పెరగనుంది.