Huge Rush in TSRTC Buses : సంక్రాంతి పండుగకు నగరం ఖాళీ అయ్యింది. నగర ప్రజలు సొంతూళ్లకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణికులు తరలివెళ్లినట్లుఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం పట్ల సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.
పండుగ తెచ్చిన రద్దీ - కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1,127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పినట్లు సంస్థ వెల్లడించింది.
సంక్రాంతి పండుగ సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక వేసింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వివరించారు. భోగి రోజు కూడా 652 ప్రత్యేక బస్సులను నడిపించాలని ప్రణాళిక వేయగా, మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పినట్లు అధికారులు తెలిపారు.