Telangana Excise Department Revenue 2022-23 : రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయిలో రూ.72 వేల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టగా.. ఆబ్కారీ శాఖ ఏకంగా రూ.31 వేల 560 కోట్ల రాబడితో సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.35 వేల 36 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 42.99 కోట్ల లీటర్ల బీరు అమ్ముడుపోయింది. లిక్కర్ కంటే బీర్లే ఎక్కువగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
Liquor sales revenue in Telangana 2022-23 : రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోనే జరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండటం, భారీ ఎత్తున స్థిరాస్థి వ్యాపారం జరగడం, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫార్మా పరిశ్రమలు ఉండటం, పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వివిధ వ్యాపార, పర్యాటక, విద్య, వైద్య అవసరాల కోసం రాకపోకలు సాగించే వారుండటం వల్ల మద్యం అమ్మకాలు భారీగా ఉంటున్నాయి. దీనికితోడు కొవిడ్ నుంచి పూర్తిగా బయటపడటం.. వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఉద్యోగులు దాదాపు బయటకు వచ్చి పని చేస్తుండటంతో బీరు అమ్మకాలు భారీగా పెరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Telangana Liquor Revenue 2022-23: జరిగిన మొత్తం అమ్మకాల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో రూ.3739.42 కోట్లు, రంగారెడ్డి రూ.8410 కోట్లు, నల్గొండ రూ.3538 కోట్లు, మేడ్చల్ రూ.1326 కోట్లు, మెదక్ రూ.2917 కోట్లు, ఆదిలాబాద్ రూ.1438 కోట్లు, కరీంనగర్ రూ.2934 కోట్లు, ఖమ్మం రూ.2222 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.2488 కోట్లు, నిజామాబాద్ రూ.1652 కోట్లు, వరంగల్ రూ.3471 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.