Traffic Pending Challan: రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన జరిమానాల రాయితీలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తొలి 3 రోజుల్లో రూ.39 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి పెండింగ్ చలానాలు చెల్లించేందుకు వీలు కల్పించడంతో వాహనదారులు వేగంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, ఈ-చలాన్ వైబ్‌సైట్‌లోకి వెళ్లి చలానాలను కట్టేస్తున్నారు.
నిమిషానికి 700 చలాన్లు..
దీంతో ఒక సెకెనుకు గరిష్ఠంగా 45 వేల హిట్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. నిమిషానికి 700 చలానాల చెల్లింపులు జరుగుతుండగా... పోలీసులు సర్వర్ సామర్థ్యం పెంచి వెయ్యి చలానాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో మార్చి1న 8 లక్షల చలానాలు, మార్చి2న 15 లక్షల చలానాలు, మార్చి 3న 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.