తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం, జనగణమనతో మార్మోగిన తెలంగాణం - NATIONAL ANTHEM SINGING IN TELANGANA NEWS

Mass singing of national anthem స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం పదకొండున్నర గంటలకు ఎక్కడి వారు అక్కడే నిల్చొని.. జాతీయ గీతం ఆలపించారు. ప్రజలందరూ జనగణమన పాడి.. దేశభక్తిని మరోసారి చాటారు.

మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం మార్మోగిన తెలంగాణం
మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం మార్మోగిన తెలంగాణం

By

Published : Aug 16, 2022, 7:46 PM IST

మరోమారు దేశభక్తిని చాటుకున్న ప్రజానీకం, జనగణమనతో మార్మోగిన తెలంగాణం


Mass singing of national anthem: జాతీయ గీతాలాపనతో రాష్ట్రమంతా మరోసారి మార్మోగింది. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యారు. హైదరాబాద్ అబిడ్స్​లోని జీపీవో సర్కిల్​ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎంపీ అసదుద్దీన్​ హాజరయ్యారు. నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అబిడ్స్ చౌరస్తాకు నలుదిక్కులా ఉన్న భవనాల మీద నుంచి వేలాది మంది గొంతు కలిపారు.

హైదరాబాద్ బీఆర్కే భవన్​లో సచివాలయ ఉద్యోగులు సామూహికంగా జాతీయ గీతం ఆలపించారు. బాన్సువాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి బాహ్య వలయ రహదారిపై కాన్వాయ్ ఆపి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల విద్యార్థులు 30 వేల మంది జాతీయ గీతం ఆలపించటంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, హరీశ్​రావు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.

ఎక్కడికక్కడే.. ఎవరికి వారే..: సామూహిక గీతాలాపన కోసం మెట్రో రైళ్లను సైతం ఎక్కడికక్కడ నిలిపేయగా.. ప్రయాణికులంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. హైటెక్ సిటీలోని విప్రో సర్కిల్​లో ఐటీ ఉద్యోగులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని.. జనగణమన పాడారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దాదాపు 7,500 మంది విద్యార్థులు గీతాలాపన చేయడం ఆకట్టుకుంది. జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, కూకట్​పల్లి, చాదర్​ఘాట్, వనస్థలిపురంలోనూ ఉత్సాహంగా కార్యక్రమం సాగింది.

పంట పొలాలు.. పెళ్లి మండపాల్లోనూ..: జిల్లాల్లోనూ జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగారంలో పంట పొలంలో నాట్లు వేసేందుకు వచ్చిన వ్యవసాయ కూలీలు.. జాతీయ గీతాన్ని ఆలపించారు. పనులు ఆపి జనగణమన పాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ నిర్ణీత సమయానికి వైద్యులు, సిబ్బంది, రోగులు, రోగుల సహాయకులు గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని పెళ్లి మండపంలోనూ జాతీయ గీతం మార్మోగింది. రెంజల్ మండల కేంద్రానికి చెందిన అవినాష్ రెడ్డి, భావనల వివాహ వేడుకలో.. వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు లేచి నిలబడి గీతాలాపన చేశారు.

రైల్లోనూ రగిలిన దేశభక్తి..: ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా 500 చోట్ల పోలీసుల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడే వాహనాలు ఆపి జనగణమన పాడారు. కరీంనగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతబూని జాతీయ గీతం పాడారు. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఎక్కడికక్కడ నిలిపి స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న రైల్లో ప్రయాణికులు జాతీయ గీతాలాపన చేశారు. ఖమ్మం, హనుమకొండ, యాదాద్రి, మహబూబ్​నగర్​ జిల్లాల్లోనూ గీతాలాపన కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

భాజపా నేతలు సైతం..: సామూహిక జాతీయ గీతాలాపనలో భాజపా నేతలు సైతం పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విసునూరులో భాజపా రాష్ట్ర అధక్షుడు బండి సంజయ్​ జాతీయ గీతాలాపన చేశారు. హైదరాబాద్​ మీర్​పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ జనగణమన పాడారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కూడలి వద్ద భాజపా ధర్నాలోనూ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రఘునందన్​రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో సామూహిక జనగణమన.. జైహింద్ నినాదంతో మార్మోగిన తెలంగాణ

తలాక్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదంటూ

ABOUT THE AUTHOR

...view details