రాష్ట్రంలో రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో రూ.157 కోట్లు విలువైన మద్యం... డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే మంగళవారం మద్యం ప్రియులు దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ఎగబడి కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాల్లో ఉన్న నిల్వలు దాదాపు అయిపోయాయి. మాదాపూర్ ప్రాంతంలో అయితే ముందే స్టాకు అమ్ముడుపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రికార్డు స్థాయిలో రూ.157 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు సరఫరా - Telangana news
లాక్ డౌన్‌తో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన రెండో రోజు కూడా జోరుగా అమ్మకాలు జరిగాయి. దీంతో డిపోలకు భారీగా అర్డర్లు వచ్చాయి.
అప్పటికే మద్యం కోసం దుకాణదారులు పెద్ద సంఖ్యలో ఇండెంట్లు పెట్టారు. అయినా డిపోల నుంచి మద్యాన్ని సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మద్యం డిపోల్లో వందలాది ఇండెంట్లు పెండింగ్ ఉన్నట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇవాళ భారీ ఎత్తున మద్యాన్ని దుకాణదారులు తెప్పించుకున్నారు.
జిల్లాల వారీగా తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.34 కోట్లు, హైదరాబాద్ రూ.16 కోట్లు, నల్గొండ రూ.17 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.15.6 కోట్లు, మెదక్ రూ.13 కోట్లు, అదిలాబాద్ రూ.10 కోట్లు, నిజామాబాద్ రూ.8 కోట్లు, వరంగల్ 12 కోట్లు లెక్కన మద్యం సరఫరా అయ్యినట్లు అధికారులు తెలిపారు. రెండు లక్షలకుపైగా కేసులు లిక్కర్, 80వేల కేసులకుపైగా బీరు డిపోల నుంచి దుకాణాలకు వెళ్లినట్లు వివరించారు.