తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. భారీగా చెల్లని ఓట్లు..! - పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు

సాధారణ ఎన్నికల్లో.. చెల్లని ఓట్లు రావడం సహజమే. మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యత వల్ల.. ఎన్నో ఓట్లు ఇలా మురిగిపోతుంటాయి. అయితే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇప్పుడు చెల్లని ఓట్లు భారీగా నమోదవుతుండటం విచిత్రం. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటినుంచి ప్రతీ రౌండ్​లోనూ.. చెల్లని ఓట్లు భారీగా బయటపడుతున్నాయి. ఉన్నత చదువులను అభ్యసించి పట్టాలు పుచ్చుకున్న వారు.. ఇలా చెల్లని ఓట్లకు కారణమవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

heavy invalid votes in telangana graduates mlc elections .
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. భారీగా చెల్లని ఓట్లు..!

By

Published : Mar 19, 2021, 9:45 AM IST

రాష్ట్రంలో రెండు స్థానాలకు జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు గత రెండు రోజులుగా కొనసాగుతోంది. పూర్తయిన అన్ని రౌండ్లలోనూ ప్రధాన అభ్యర్థుల ఓట్లతో చెల్లని ఓట్లు పోటీ పడుతుండడం విశేషం. ఒక్కో రౌండ్‌కి సుమారు 56 వేల ఓట్లు లెక్కిస్తుండగా 5-7 శాతం దాకా మురిగిపోయిన ఓట్లే ఉండడం గమనార్హం. పూర్తయిన మూడు రౌండ్లలో 10,082 ఓట్లు మురిగిపోవడం విశేషం. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటేసేందుకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఒక అభ్యర్థికే కాకుండా తనకు నచ్చిన అందరికీ ప్రాధాన్యతా క్రమాన్నిస్తూ ఓటేయొచ్ఛు అదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వార్తా పత్రిక పరిమాణంలో బ్యాలెట్‌ పత్రంలో ఉంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పక్కన ప్రాధాన్యత క్రమాన్ని ఇస్తూ పోయారు. పోలింగ్‌ అధికారులిచ్చిన పెన్ను మాత్రమే ఇందుకు ఉపయోగించాలి. పార్టీ గుర్తులతోపాటు ఇతర రాతలు నిషేధం. ఏవైతే నిషేధితమో వాటిని ఉపయోగించే ఎక్కువ మంది ఓటేయడంతో చెల్లని ఓట్లు పెరుగుతున్నాయి.

ఆ ఓట్లే ఎక్కువ..

హైదరాబాద్‌ స్థానానికి 3.57 లక్షల ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్‌లో 3374 చెల్లని ఓట్లు, రెండో రౌండ్‌లో 3375, మూడో రౌండ్‌లో 3333 పైగా ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఐదుగురికి మినహాయించి మిగతా అందరికీ చెల్లని ఓట్లకంటే తక్కువ ఓట్లు పోలవడం గమనార్హం.

లెక్కింపు ఆలస్యం అందుకే..

బ్యాలెట్‌ పత్రాల్లో కొందరు ఇష్టమొచ్చినట్లు రాతలు రాయగా.. మరికొందరు సంతకాలు చేశారని ఎన్నికల విధుల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కొందరు ఒకే నంబరు ఇద్దరు అభ్యర్థులకు వేశారన్నారు. చెల్లని ఓట్ల విషయంలో ఏజెంట్లు అభ్యంతరం తెలుపుతుండటంతో ఒక్కోదానికి కనీసం 5 నిమిషాల సమయం పడుతోందని.. అందుకే ఒక్కో రౌండ్‌ ఫలితానికి 7-8 గంటల సమయం అవసరమవుతోందని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:నల్గొండలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 10 మంది ఎలిమినేషన్

ABOUT THE AUTHOR

...view details