తెలంగాణ

telangana

ETV Bharat / state

పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..! - పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

ఆపిల్‌ పోషకభరితం. మామిడి మధురాతిమధురం. సీతాఫలం అమృతతుల్యం. బొప్పాయి ఔషధ ఫలం... ఇలా ఒక్కో పండు గురించీ ఒక్కోటి చెబుతుంటారు. కానీ పనసపండు గురించి చెప్పాల్సి వస్తే అన్ని విషయాల్లో అద్భుతః అనాల్సిందే. కాయగానూ పండుగానే కాదు, శాకాహారుల మాంసాహారంగానూ ఇది మార్కులు కొట్టేసింది. కాఫీ, చాక్లెట్లూ, కుకీలతో పాటు కొత్తగా జ్యూసు రూపంలోనూ చవులూరిస్తూ, సూపర్‌ఫ్రూట్‌గానూ పేరొందిన పనస కథాకమామీషు..!

huge health benifits from jackfruit
పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

By

Published : Jun 22, 2020, 2:01 PM IST

ఈమధ్య తరచూ వార్తల్లో వినిపించే పండు ఏదైనా ఉందీ అంటే అది పనసే. ఎందుకంటే కాయలూ పండ్లూ ఏవైనా గానీ అన్నీ శాకాహారమే. ఒక్క పనస మాత్రమే అటు మాంసాహార ఇటు శాకాహార రుచులతో ఇరువురికీ నోరూరిస్తోంది. తూర్పూ, పడమర అన్న తేడా లేకుండా అందరినీ తనదైన రుచితో అలరిస్తోంది. అందుకే దానిమీద పరిశోధనలూ ఎక్కువయ్యాయి. ఫలితంగా పనసలోని పోషక, ఔషధ గుణాల జాబితా, తద్వారా దాని ఉత్పత్తుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది.

పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

పసందైన పనస!

దక్షిణాదిన పనస లేని పెరడు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఘాటైన తియ్యని వాసన కారణంగానే అది ఎంత బరువైనా, కోయడం కష్టమైనా, దాన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురుచూసేవాళ్లు ఎందరో. అయితే చాలామంది తొనల్ని మాత్రమే తింటే, కొందరే ఆ గింజలతోనూ పచ్చి పనసతోనూ కూరలు వండుతారు. కానీ ఇప్పుడు.. పనస ఓ పండు మాత్రమే కాదు, రుచికరమైన కూరగాయ అనేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఆవ పెట్టిన పనస కూరని రుచి చూడాల్సిందే అని పాత తరం అంటే, పనస ముక్కలు వేసి వండే బిర్యానీ అదిరిపోతుంది అంటోంది ఈతరం.

పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

పనసలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల అది మాంసం లానే మసాలాల్ని పీల్చుకుని అదే రుచిని ఇస్తుంది. ఆ రుచి అమెరికన్​లకీ, యూరోపియన్లకీ కూడా నచ్చడం వల్ల పోర్క్‌కి బదులు జాక్‌ ఫ్రూట్‌ వచ్చిందోచ్‌ అని సంబరపడుతూ వంటల్లోనే కాకుండా కేకులూ, ఐస్‌క్రీముల్లోనూ వాడేస్తున్నారు. పిజ్జా టాపింగ్సులోనూ అలంకరిస్తున్నారు. ఫలితంగా ఏటా 2 వేల కోట్ల ఖరీదు చేసే పనస కాయలు భారత్‌ నుంచే ఎగుమతి అవుతున్నాయి.

జాతీయ ఉద్యానవనశాఖ అంచనా ప్రకారం దేశంలో ఏడాదికి 17.4 లక్షల టన్నుల జాక్‌ఫ్రూట్‌ పండుతోంది. కానీ గతంలో అందులో చాలానే వృథా అయ్యేవి. ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో పనసని విరివిగా పండిస్తారు. రోజూ వంద మెట్రిక్‌ టన్నుల పనసను వాళ్లే తినేస్తుంటారు కూడా. భోజనంలో అన్నం, చేపల కూరతో పాటు పనసతొనలూ లేకుంటే ముద్ద కూడా దిగదట కేరళీయులకి. కొబ్బరిపాలు, సీఫుడ్‌తో చేసే వంటకాలకయితే దీన్ని మించిన కాంబినేషనే ఉండదట. ఇక, పనస పిక్కలతో చేసే పచ్చళ్లూ, పొడులూ, బర్ఫీలూ, బిస్కెట్లూ రుచే రుచి అంటూ చప్పరిస్తారు.

కేరళలోని ముట్టిప్పాళలోని చక్కా(పనస) రెస్టారెంట్‌లో పకోడీ, బజ్జీ, బిర్యానీ, జ్యూస్‌, సోడా... ఇలా 30 రకాలకు పైగా పసందైన పనస వంటలు దొరుకుతాయి. కొంకణ్‌, గోవాల్లోనూ పనస వాడకం ఎక్కువే. గింజల్ని పొడి చేసి, మిల్క్‌షేక్‌లూ, సూప్‌లూ, హల్వాలూ, మోమోలూ, టాకోలూ, వడలూ, కట్‌లెట్లూ చేస్తుంటారు. పనస తొనల్ని ఎండబెట్టి చిప్సూ వడియాల్లా వేయించుకుంటారు. కేటరింగ్‌ టెక్నాలజిస్టులకయితే పనస అతి పెద్ద ప్రయోగశాల.

సంప్రదాయ, ఆధునిక వంటల్ని కలగలిపి చేసే వంటల్లో పనసను చొప్పించేస్తూ కొత్త రుచులు సృష్టిస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా వాడే పనస పండుని మామిడి, ద్రాక్ష పండ్ల తరహాలో జ్యూస్‌ రూపంలో నిల్వచేయడం కష్టంగా ఉండేది. అందుకే బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చరల్‌ రిసెర్చ్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు మూడేళ్ల పాటు కృషి చేసి, 6 నెలల పాటు నిల్వ ఉండే రెడీ టూ డ్రింక్‌ని తయారుచేశారు. కొన్ని ఎంజైమ్‌ల సాయంతో ప్రిజర్వేటివ్సూ, పంచదారా కలపకుండా చేసిన ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. దీంతో పాటు గింజల్నీ పండ్ల గుజ్జునీ ఎండబెట్టి పొడి చేసి దాంతో చాక్లెట్లూ, కుకీలూ చేస్తున్నారు. 5 నుంచి ఆరు శాతం ప్రొటీనూ, తక్కువ కొవ్వులూ, పీచూ యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉండే ఇవి, మార్కెట్లోని చాక్లెట్ల కన్నా మంచివట.

పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

పోషకాల పండు!

గ్లోబల్‌ వార్మింగ్‌ని తట్టుకుని కరవు సమయంలోనూ ప్రపంచానికి ఆహారాన్ని అందించగల అతిపెద్ద పండు పనస అంటున్నారు పోషక నిపుణులు. ఏడాది పొడవునా కాసే రకాల్నీ కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉండే ఎర్రని పనస రకాల్నీ సృష్టించడంతో దీని వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. తియ్యని పనస వల్ల షుగర్‌ పెరుగుతుందన్న భయంతో చాలామంది దూరం పెడతారు. కానీ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రబృందం చేసిన పరిశోధనలో పనస, రక్తంలో గ్లూకోజుని నియంత్రిస్తుందని తేలింది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం నియంత్రణలో ఉంటాయి. కాబట్టి అన్నం, బ్రెడ్డు బదులుగా దీన్ని తీసుకోవచ్చు అంటున్నారు. బీపీ రోగులకీ మంచిదే. ఇందులోని కాపర్‌ థైరాయిడ్‌ని తగ్గిస్తే పీచు పైల్స్‌ని నియంత్రిస్తుంది. పనసలోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాల్నీ క్యాన్సర్లనీ నివారిస్తాయి. గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నేరుగా లేదా అన్నంలో కలిపి తిన్నా అజీర్తి సమస్యలు తగ్గుతాయట.

పెద్దపేగు క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీఆక్సిడెంట్లూ పనసలో ఎక్కువే. ఇందులోని ఎ-విటమిన్‌ మెదడు నరాలకి మేలు చేస్తుందట. రక్తహీనతకీ పనస మంచిదే. సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే పనస కొల్లాజన్‌ ప్రొటీన్‌ను పెంచి బంధన కణజాలానికి తోడ్పడే ప్రొటీన్‌ ఉత్పత్తికి దోహదపడటంతో పుండ్లు త్వరగా తగ్గుతాయి. జాక్‌ఫ్రూట్‌ని పవర్‌హౌస్‌ అనీ అంటున్నారు నిపుణులు. ఈ పండు మధ్య భాగాన్ని కార్బన్‌ ఏరోజల్‌గా మార్చి, మొబైల్‌ ఫోన్లను ఛార్జ్‌ చేసేందుకు వాడే కెపాసిటర్లూ చేస్తున్నారు. అందుకే మనదైన పనసని సూపర్‌ ఫ్రూట్‌గా అభివర్ణిస్తోంది నేటి శాస్త్ర ప్రపంచం!

పోషకాల పండు పనసకి పెరుగుతోంది డిమాండు..!

పోషకాలు

  • వంద గ్రా. పనస పండులో...
  • శక్తి : 71 క్యాలరీలు
  • ప్రొటీన్‌ : 1.72 గ్రా.
  • కార్బొహైడ్రేట్లు : 22.5 గ్రా.
  • పీచు : 37 గ్రా.
  • విటమిన్‌- సి : 13.6 మి.గ్రా.
  • కాల్షియం : 34 మి.గ్రా.
  • ఫాస్ఫరస్‌ : 36 మి.గ్రా.
  • పొటాషియం : 303 మి.గ్రా.

ఐరన్‌ : 0.6 మి.గ్రా.

ఇదీచూడండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details