తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​లో నీటి పారుదలకు భారీగా నిధులు

సాగునీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం సింహభాగం నిధులను కేటాయించింది. భారీ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించటమే లక్ష్యంగా కేటాయింపులు చేపట్టిన సర్కార్... పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా నిధుల కేటాయించింది. సీతారామ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు చేసింది.

telangana budget
బడ్జెట్​లో నీటి పారుదలకు భారీగా నిధులు

By

Published : Mar 8, 2020, 8:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించింది. రూ.11,053కోట్లు ప్రకటించింది. ఈ మొత్తంలో భారీ, మధ్యతరహాకు రూ.10,406కోట్లు... చిన్న నీటిపారుదలకు రూ.602 కోట్లు కేటాయించారు. నిర్వహణా పద్దు కింద రూ.7,446కోట్లను, ప్రగతి పద్దు కింద రూ.3,606 కోట్లు ప్రతిపాదించారు.

బడ్జెట్​లో నీటి పారుదలకు భారీగా నిధులు

బడ్జెట్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం 2017-18లో బడ్జెట్ నిధుల్లో నీటిపారుదలకు చేసిన ఖర్చు రూ.12,994కోట్లు. 2018-19లో చేసిన ఖర్చు రూ.9,506 కోట్లు. 2019-20 సవరించిన అంచనా రూ.8,476 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రగతిపద్దు కింద ప్రతిపాదించిన 3,606 కోట్ల రూపాయల్లో... భారీ, మధ్యతరహా నీటిపారుదలకు రూ.3,183కోట్లు, చిన్న నీటిపారుదలకు రూ.407కోట్లు కేటాయించారు.

పథకాలకు ప్రతిపాదనలు..

మిషన్ కాకతీయ పథకానికి రూ.264కోట్ల రూపాయలు, ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు రూ.39 కోట్లు ప్రతిపాదించారు. ఏఐబీపీ కింద ఐదు భారీతరహా ప్రాజెక్టులకు 91.54కోట్లు, చిన్ననీటిపారుదలకు రూ.26.48 కోట్లు కేటాయించారు. ఏఐబీపీ కింద దేవాదులకు రూ.55కోట్లు, ఎస్సారెస్పీ మొదటి దశకు రూ.33 కోట్లను ప్రతిపాదించారు.

ఏ ప్రాజెక్టుకు ఎంతెంతంటే...

ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల్లో సీతారామ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేలా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు రూ.910 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.805కోట్లు... పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.368కోట్లను కేటాయించింది. దేవాదుల ఎత్తిపోతలకు రూ.224కోట్లు, ఎస్సారెస్పీ వరదకాల్వకు రూ.131కోట్లను ప్రతిపాదించారు. కంతనపల్లికి రూ.73కోట్లు, శ్రీరాంసాగర్ రెండో దశకు రూ.61కోట్లు, లోయర్ పెన్ గంగకు రూ.60కోట్లు ప్రతిపాదించారు. డిండి ఎత్తిపోతలకు రూ.49కోట్లు, నిజాంసాగర్ ఆధునికీకరణకు రూ.48కోట్లు కేటాయించారు.

ప్రధాన ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు చూస్తోంటే... వాటిని పూర్తి చేయడానికి బడ్జెట్ నిధుల కంటే బడ్జెటేతర నిధులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతోంది. రుణాల ద్వారా నిధులు సమీకరించుకునే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసింది. ఇదే తరహాలో పాలమూరు - రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.

ఇదీ చూడండి:వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.రెండు లక్షల కోట్ల అప్పు

ABOUT THE AUTHOR

...view details