తెలంగాణ

telangana

ETV Bharat / state

Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో - ఉచిత నీటి పథకం

మహానగరంలో కరోనా వల్ల 6-7 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇబ్బంది పడుతున్నాయి. కొవిడ్​ నుంచి కోలుకోవడానికి చాలా కుటుంబాలు రూ.లక్షల్లో ప్రైవేటు ఆస్పత్రులకు డబ్బులు చెల్లించి అప్పులపాలయ్యాయి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో జలమండలి లక్షలాది మందికి మనోవేదన కలిగిస్తోంది. ఒకేసారి 5 నెలల బిల్లు సుమారు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తారా? లేని పక్షంలో తాగునీటి కనెక్షన్‌ తీసేయమంటారా? అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనాతో ఆర్థికంగా చితికిపోయామని, జలమండలి తీరు మరింత కుంగదీస్తోందని, మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకుని ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

huge-drinking-water-bills-from-the-aquifer
Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో

By

Published : May 29, 2021, 7:44 AM IST

డిసెంబరు 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ(GHMC) పాలకవర్గ ఎన్నికల హామీల్లో భాగంగా మహానగరంలో అందరికీ తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.20 వేల లీటర్ల చొప్పున ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తరువాత జలమండలి అధికారులు ఈ పథకాన్ని నీరుగార్చే వ్యూహంపై దృష్టిపెట్టారు. ప్రతి తాగునీటి కనెక్షన్‌దారుడు తమ ఆధార్‌ నంబర్‌, బల్దియా ఆస్తి పన్ను క్యాన్‌ నంబర్‌ జలమండలి వెబ్‌సైట్లో నమోదు చేయాలని అప్పుడే ఉచిత తాగునీటికి అర్హులవుతారని ప్రకటించారు. లక్షల మంది నల్లాదారులు వివరాలు నమోదు చేశారు. పలు కారణాలతో కొన్ని అపార్టుమెంట్ల వాసులు పూర్తిస్థాయిలో నమోదు చేయలేకపోయారు. ఒక అపార్టుమెంట్‌లో 20 ఫ్లాట్స్‌ ఉంటే 18 ఫ్లాట్‌ యజమానులు వివరాలను నమోదు చేసినా సంబంధిత అపార్టుమెంట్‌ను ఉచిత నీటి పథకం(Free Water Scheme)లో భాగం చేస్తామని తొలుత అధికారులు ప్రకటించారు. ఈలోగా నమోదు గడువు పూర్తవడంతో 5 నెలల తాగునీటి బిల్లులను అధికారులు ఇప్పుడు పంపిస్తున్నారు. ఇవి భారీ మొత్తంలో ఉంటున్నాయి.

నమోదు కాలేదన్న సాకుతో..

● అత్తాపూర్‌ సోమిరెడ్డి నగర్‌లో ఒక అపార్టుమెంట్‌లో 15 ఫ్లాట్స్‌ ఉంటే 14 ఫ్లాట్స్‌ యజమానుల వివరాలను నమోదు చేశారు. ఒక్క దాని వివరాలు నమోదు చేయలేదన్న కారణంతో ఆ అపార్టుమెంట్‌కు రూ.వేలల్లో బిల్లును పంపించడంతో యజమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

● మెహిదీపట్నంలోని ఒక పెద్ద అపార్టుమెంట్‌లో దాదాపు అన్ని ఫ్లాట్స్‌ వివరాలను నమోదు చేసినా అయిదు నెలల బిల్లు కింద రూ.1.25 లక్షలు పంపించారు.

ఉపాధి కోల్పోయిన దీనస్థితిలో

కరోనా వైరస్‌ నిరోధంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల లక్షలాది మంది చిరువ్యాపారులు ఇతరులు ఉపాధి కోల్పోయారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో 5 నెలల బిల్లు ఒకేసారి పంపించి వచ్చే నెల మధ్యలో చెల్లించకపోతే నల్లా కనెక్షన్‌ తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా కుటుంబాలన్నీ ఆందోళనలో ఉన్నాయి. తక్షణం మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. బిల్లుల చెల్లింపును నిరవధికంగా వాయిదా వేయాలని విన్నవిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే వెళుతున్నాం

భారీ బిల్లుల విషయమై జలమండలి ఉన్నతాధికారులను వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి:Irrigation projects: ఎత్తిపోతల పథకాల నిర్వహణకు షార్ట్ టెండర్లు

ABOUT THE AUTHOR

...view details