Huge Crowd At Telangana Bus Stands occasion of Sankranti : సంక్రాంతి రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారికి వాహనాలు పోటెత్తాయి. ఆయా టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి రద్దీ నెలకొంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో ప్రయాణికులకు అవసరాలను తీరుస్తోంది.
సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ ఎంజీబీఎస్, సికింద్రాబాద్ జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, లింగంపల్లి, మియాపూర్, కేపీహెచ్బీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు వెళ్లేందుకు పయనం కావడంతో బస్సుల్లో రద్దీ భారీగా కనిపిస్తోంది. మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి.
హైదరాబాద్ - విజయవాడ రూట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో కనీసం కాలు పెట్టే జాగ కనిపించడం లేదు. సీట్ల కోసం అతివలు పోటీపడుతున్న దృశ్యాలు ఆయా ప్రయాణ ప్రాంగణాల్లో కనిపించింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సులను నడుపుతూ ప్రజల అవసరాలను తీరుస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలోనూ సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారితో నిండిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పండుగ కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.