వరద బాధితులతో హైదరాబాద్లోని మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. నగరంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందని వరద బాధితులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ. 10 వేలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే అందుకు గాను బాధితులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.
మీ సేవ కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారా అని ఆయా కేంద్రాల ముందు మురికి వాడలు, బస్తి తదితర ప్రాంతాల ప్రజలు గంటల తరబడి కూర్చున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని చిక్కడ పల్లి, రామ్ నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో ఇతర సేవల కన్నా వరద బాధితుల దరఖాస్తుల నమోదు ప్రక్రియ కోసం వందలాది మంది క్యూ కట్టారు.