తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్స్య వ్యాపారులూ.. చేపల మార్కెట్​ల్లో కరోనా విలయతాండవం

కరోనా నేపథ్యంలో చేపల మార్కెట్లలో పరిస్థితి భయానకంగా మారుతోంది. ఆదివారం, సెలవు దినాల్లో రద్దీ గణనీయంగా పెరుగుతుండటం వల్ల వినియోగదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటించడం లేదు. అసలే వర్షాకాలం... ఆపై హైదరాబాద్‌లో పలు చేపల మార్కెట్లలో వర్తకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఫలితంగా క్షణం క్షణం వినియోగదారులు భయపడుతూ చేపలు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

మత్స్య వ్యాపారులూ.. చేపల మార్కెట్​ల్లో కరోనా విలయతాండవం
మత్స్య వ్యాపారులూ.. చేపల మార్కెట్​ల్లో కరోనా విలయతాండవం

By

Published : Jul 23, 2020, 11:43 PM IST

దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా రక్కసి తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. హైదరాబాద్ జంట నగరాల్లో చేపల మార్కెట్లు బంద్ పాటిస్తే ఉత్తమం అన్న వాదన మత్స్య వ్యాపారుల్లో వినిపిస్తోంది.

కరోనా ఉద్ధృతి వల్లే...

కరోనా వైరస్ ఉద్ధృతి భయంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో చేపల మార్కెట్‌కు సెలవు ప్రకటించిన తరుణంలో హైదరాబాద్​లోనూ అదే తీరు అవలంభించాలనే వాదన ఎక్కువైంది. ప్రత్యేకించి భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడంపై ప్రజల్లో అవగాహన కలిగిన్నప్పటికీ... రైతుబజార్లు, మార్కెట్లకు వెళ్లినప్పుడు పెద్దగా పాటించడం లేదు.

చేపల మార్కెట్​ సంగతి అంతే...

ఇక చేపల మార్కెట్లలో అయితే కేంద్రం ప్రకటించిన అన్‌లాక్‌ మార్గదర్శకాలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సాధారణంగా చేపల మార్కెట్లు అంటేనే దుర్వాసన, అపరిశుభ్రత, మురికి వాతావరణానికి నిలయం అన్న నానుడి ఉంటుంది.

రాష్ట్రంలోనే అతిపెద్దది...

తెలంగాణలోనే అతి పెద్ద చేపల మార్కెట్​గా ప్రసిద్ధిగాంచిన ముషీరాబాద్ రాంనగర్‌, నగరంలో పేరు గాంచిన బేగంబజార్‌ మార్కెట్ సహా సరూర్‌నగర్ వంటి రైతుబజార్ల వద్ద వ్యాపార సంఘాలు పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు విపిస్తున్నాయి.

బల్దియా పరిధిలో విజృంభణ...

హెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చేపల మార్కెట్లలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టడం సహా లోపలకు ప్రవేశించే సమయంలో శానిటైజేషన్‌ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా అవేమీ మచ్చుకైనా కనిపించడం లేదు.

రోగనిరోధక శక్తి కోసం...

రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే పౌష్టిక ఆహారం తినేందుకు భయం భయంగానే మార్కెట్‌కు వచ్చి చేపలు కొనుగోలు చేయాల్సి వస్తుందని వినియోదారులు బెంబెలెత్తుతున్నారు.

లాక్​డౌన్ ఆరంభంలో...

కొవిడ్-19 లాక్​డౌన్ ఆరంభంలో రెండు వారాలకుపైగా రాంనగర్‌ చేపల మార్కెట్‌ను ప్రభుత్వం మూసేసింది. ఆ సమయంలో పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి.

రాంనగర్ మత్స్య సొసైటీ వ్యతిరేకిస్తోంది...

ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్‌ భవన్‌ వద్ద ఖాళీ స్థలంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్,‌ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్... నూతన మార్కెట్ కోసం చర్యలు తీసుకుంటున్న సమయంలో రాంగనర్ మత్స్య సహకార సంఘం, వ్యాపార, కటింగ్ కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయిందన్నారు. ఫలితంగా వెనుకడుగు వేసిన్లు మంత్రి పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఇదే మార్కెట్​ను నమ్ముకుని జీవితాలు వెళ్లదీస్తున్న తాము రాంనగర్ చేపల మార్కెట్ యార్డు వదిలి ఎక్కడికి వెళ్లబోమంటూ సంఘాలు వ్యతిరేకించాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ అంతా చిత్తడిగా తయారై దుర్వాసన వెలువడుతోంది. మార్కెట్‌లో పారిశుద్ధ్యం, శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని వినియోగదారులు సూచిస్తుండగా... తాము అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చేపల కటింగ్ కార్మికులు చెబుతున్నారు.

విజయవాడలో అమ్మకాలపై నిషేధం...

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా, ప్రధానంగా విజయవాడలో కరోనా కేసుల సంఖ్య అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి విజయవాడలో చేపల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ నెల 26 వరకు చేపల మార్కెట్లు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్​లోనూ భయాందోళనలే...

అలాంటి భయాందోళనలే హైదరాబాద్‌లోనూ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో... బేగంబజార్‌, రాంనగర్ చేపల మార్కెట్లు కూడా రెండు మూడు వారాలపాటు మూసివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఏ ఒక్కరూ చేపలు తెచ్చి అమ్మకుండా కఠినంగా వ్యవహరించకపోతే... తమలో పోటీ వాతావరణం పెరిగి నిబంధన ఉల్లఘించే ప్రమాదముందని, తప్పసరిగా మార్కెట్‌ బంద్ చేయాలని వర్తకులు కోరారు.

జంట నగరాల్లో చేపలు, మాంసం, చికెన్ మార్కెట్లు, రైతుబజార్ల వద్ద పరిస్థితి భయంకరంగా దర్శనమిస్తోంది. భయం లేకుండా వినియోగదారులు దూసుకొస్తారు తప్ప భౌతికదూరం పాటించాలన్న స్పృహ కనిపించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌

ABOUT THE AUTHOR

...view details