తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా.. బ్లాక్ ఫంగస్‌తో ఆందోళన - news updates of andhrapradhesh

ఏపీలో కొవిడ్ వైరస్‌ కాస్త తగ్గుముఖం పడుతుందని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్‌ దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొత్త రోగంతో ముగ్గురు మృతిచెందగా ఒక్క ప్రకాశం జిల్లాలోనే 36 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు.. ఆపత్కాలంలోనూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై అధికారులు చర్యలు చేపట్టారు.

huge-black-fungus-cases-registered-in-andhra pradesh
ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా.. బ్లాక్ ఫంగస్‌తో ఆందోళన

By

Published : May 24, 2021, 8:49 AM IST

ఏపీలో బ్లాక్ ఫంగస్‌తో ఆందోళన

ఆంధ్రప్రదేశ్​లో బ్లాక్‌ ఫంగస్ కేసులు మరింత గుబులు రేపుతున్నాయి. ఈ వ్యాధి సోకి కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు కన్నుమూశారు. చనిపోయిన వారంతా కరోనా బారినపడి కోలుకున్నవారే. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 36 మందిలో లక్షణాలు గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం నాగులాపురానికి చెందిన కేవీ ప్రసాద్‌ బ్లాక్‌ ఫంగస్‌తో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లిని ఓ ఆసత్రిలో కృష్ణా జిల్లా నున్నకు చెందిన చింతా వెంకటేశ్వరావు, గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కట్టా సాంబయ్య బ్లాక్ ఫంగస్ వ్యాధితోనే మృతి చెందారు. కృష్ణా జిల్లాలోనూ 50 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ అంటువ్యాధి కాదని ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

ఫలితమిస్తున్న కర్ఫ్యూ

ఏపీలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేస్తుండటంతో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాల్లో అధికారులు, నేతలు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కరోనా ఆస్పత్రి, కొవిడ్ కేర్‌ సెంటర్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌తో కలిసి నోడల్ అధికారి శివశంకర్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో సినీ దర్శకుడు సుకుమార్‌ అందించిన 40 లక్షల ఆర్థికసాయంతో నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేంగా సాగుతున్నాయి. కొవిడ్ ఉద్ధృతితో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రైళ్లలో బోగీలు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మీదుగా వెళ్లే కుర్లా- కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ వెలవెలబోయింది. సాధారణ రోజుల్లో ఈ రైలులో సీటు దొరకాలంటే... నెలరోజులు ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది.

అధిక ఫీజులు.. అధికారుల చర్యలు

కరోనా కాలంలోనూ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై అధికారుల కొరడా ఝళిపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా వైద్యసేవలు అందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించని 13 ఆసుపత్రులకు రూ.56 లక్షలు జరిమానా విధించారు.

దాతలు.. సహాయాలు..

కరోనా రోగులకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా వివిధ ట్రస్టులు, సంస్థలు, దాతలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, మందులు సాయం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని కేకేసీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కి రూ.25 లక్షలు విలువైన మందులు, 16 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను రోజా ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా బెంగళూరుకు చెందిన మిత్ర కార్పొరేట్ సంస్థ అందించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని సహృదయ ఫౌండేషన్‌కి చెందిన యువకులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా రోగులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ తమ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో చిత్తూరు జిల్లా నిలువరాతిపల్లె ప్రజలు గ్రామదేవత గంగమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు.

ఇవీ చదవండి:అధిక యాంటీబయాటిక్సే బ్లాక్​ ఫంగస్​కు కారణం!

ABOUT THE AUTHOR

...view details