lorry challans ap ts boarder: రోడ్డు రవాణాలో లారీలదే కీలక పాత్ర. నిత్యం వందలాది లారీలు తెలుగు రాష్ట్రాల్లో అటు నుంచి ఇటు నుంచి సరకు బట్వాడా చేస్తుంటాయి. కూరగాయలు, పండ్లు సహా ఇంకెన్నో నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తాయి. లాభాల బాటలో పయనిస్తున్న లారీ పరిశ్రమను ఒక్కసారిగా కుంగదీసింది... కరోనా సంక్షోభం. ఈ విపత్కర సమయంలో చాలా లారీలు షెడ్లకే పరిమితమయ్యాయి. కొవిడ్ క్రమంగా తగ్గినా.. కొన్ని చోట్ల చాలా రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ అమలు... లారీ యజమానులకు గుదిబండలా మారింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి తగ్గించడం వల్ల.. సరుకు రవాణా లేక లారీ యజమానులు సతమతమయ్యారు. భారీ స్థాయిలో రవాణా మెుత్తం రైల్వే శాఖకు వెళ్లటం.. మరింత ఇబ్బందులకు గురిచేసింది. తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తివేయటం వల్ల మళ్లీ గాడిన పడింది ఈ పరిశ్రమ. కానీ...ఇప్పుడు చలాన్ల రూపంలో మరో సమస్య లారీ యజమానులను కలవరపెడుతోంది.
సరిహద్దు దాటాలంటే వణుకు
lorry owners struggles in telangana: నిత్యం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో ప్రజా, సరుకు రవాణా జరగడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం సరిహద్దు దాటాలంటే లారీ నిర్వాహకులు వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ట్రిప్పునకు సుమారు 2వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి రావటం. ఏడాదికి ఒక్కో లారీ నిర్వాహకుడు 80వేల రూపాయల పైచిలుకు చెల్లించాల్సి వస్తోంది. కరోనా గండం దాటి... నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నామన్న ఆనందం అదనపు చెల్లింపులతో ఆవిరైపోతోంది. డీజిల్ ధరల పెరుగుదలతోనే ఆర్థిక భారం పెరుగుతోంది అనుకుంటే... చలాన్ల వడ్డనతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఏడేళ్లుగా రెండు రాష్ట్రాల రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా... ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడకు వెళ్తే మరో 2వేలు చెల్లించాల్సిందే..
Counter Signature Permit : తెలంగాణలో సుమారు 5లక్షల 60వేల సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,75,000 భారీ వాహనాలు ఉన్నాయి. ఈ భారీ వాహనాల్లో సుమారు 75వేల నుంచి 90వేల వరకు పాతవే. నిత్యం పాలు, కూరగాయలు, ఇసుక, సిమెంట్, ఇనుము, కంకర వంటి వాటిని లారీల నిర్వాహకులు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. పొరుగు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. పొరుగు రాష్ట్రంలో తిరిగేందుకు 5వేల రూపాయలు చెల్లిస్తే.. ఏడాది పొడవునా తిరిగే వెసులుబాటు ఉంటుంది. దాన్నే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌గా పేర్కొంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు ఇదే విధంగా 5వేల రూపాయలు చెల్లించి లారీ నిర్వాహకులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ..రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్తే...అదనంగా 2వేలు చెల్లించాల్సి వస్తోంది.
కొలిక్కిరాని ఒప్పందం
Single permit : దేశంలో ప్రతీ రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతిసారి కనీసం...15 వందల వరకు చలానా కడతారు. ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్ పర్మిట్ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా 5 వేలు చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఏపీతో మాత్రం ఇంతవరకు చేసుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సింగిల్ పర్మిట్ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ఫలితంగా...లారీ యజమానులకు అదనపు చెల్లింపుల బాధ తప్పటం లేదు.
ఏ పక్కకు వెళ్లినా అదే బాదుడు
ap telangana boarder charges: రోజూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లి రావాలంటే.. వేలకు వేలు చలానా కడుతున్నారు లారీల యజమానులు. ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింగిల్ పర్మిట్ విధానంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. కోదాడ నుంచి చిల్లకల్లు పోయి రావాలంటే.. సింగిల్ ట్రిప్‌నకు 1,600లు కట్టాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మూడు నుంచి నాలుగు వందల ఖర్చు ఉంటోంది. ఈ విధంగా ప్రతి ట్రిప్‌నకు రెండువేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. మహబూబ్‌నగర్ నుంచి కర్నూల్‌కు వెళ్లి రావాలంటే సరిహద్దు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం...ఒక్క ట్రిప్‌నకు 2వేల వరకు అదనంగా ఖర్చవుతోంది.
తెలంగాణలో 60 శాతం వరకు ఓనర్ కం డ్రైవర్లు ఉన్నారు. ఎక్కువ పాత వాహనాలు ఉన్నాయి. వారికి కచ్చితంగా సింగిల్ పర్మిట్ కౌంటర్ సిగ్నేటర్ పర్మిట్ అవసరం ఉంటుంది. అవి లేకపోవడం వల్ల అదనంగా ప్రతి ట్రిప్పుకు రూ. 2వేలు ఖర్చవుతోంది. - రాజేందర్ రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు