రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను రెండు ఔషధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక సంస్థకు రోజుకు 34 వేలు, మరొకటి రోజుకు 37 వేల ఇంజక్షన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. రెండు సంస్థల ఇంజక్షన్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు వరకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉండడంతో.. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఆసుపత్రులు పెద్దఎత్తున వినియోగించాయి. అందుకు తగ్గట్లుగా ఔషధ సంస్థలూ ఇంజక్షన్లను ఉత్పత్తి చేశాయి. క్రమేణా కేసులు తగ్గుముఖం పట్టడంతో రెమ్‌డెసివిర్ వాడకం తగ్గుతూ వచ్చింది. ఔషధ సంస్థలూ ఉత్పత్తిని తగ్గించాయి. గత మార్చి రెండో వారం నుంచి కొవిడ్ రెండోదశ ఉధ్ధృతి మొదలైంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నెల మొదటి వారంలో ఒక్కరోజులోనే 1,000 కేసులు నమోదు కాగా.. 17వ తేదీన 5,000 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఔషధ సంస్థల వద్ద సరిపోయినన్ని నిల్వలు లేవు.
బహిరంగ విపణిలో అందుబాటులో లేక..
కొవిడ్ మొదటి దశలోనూ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడింది. బహిరంగ విపణిలో కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఇంజక్షన్‌ను ఉత్పత్తి సంస్థలు నేరుగా ఆసుపత్రులకే సరఫరా చేయాలని ఔషధ నియంత్రణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధానం ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ కారణంగా బహిరంగ విపణిలో అందుబాటులో లేదు. వాస్తవానికి గరిష్ఠ చిల్లర ధర కంటే కూడా నాలుగో వంతు ధరకే ఆసుపత్రులకు ఉత్పత్తి సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఒక సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.800కే సరఫరా చేస్తోంది. అయినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. డబ్బు ముందుగానే చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.
మరో రెండు సంస్థలకు అనుమతి
రాష్ట్రంలో మరో రెండు ఔషధ సంస్థలకు రెమ్‌డెసివిర్ ఉత్పత్తి కోసం అనుమతిచ్చినట్లుగా ఔషధ నియంత్రణాధికారులు తెలిపారు. రోజుకు మరో 35-40 వేల వరకు ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తవుతున్న ఇంజక్షన్లలో నాలుగో వంతు మాత్రమే రాష్ట్రంలోని ఆసుపత్రులకు సరఫరా చేస్తుండగా.. మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతోనూ కొరత ఏర్పడుతోంది. ఇంజక్షన్‌ను ఉత్పత్తి చేసిన అనంతరం నాణ్యత ప్రమాణాల పరిరక్షణలో భాగంగా కనీసం 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలి. నాణ్యత ధ్రువీకరణ తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఉత్పత్తి చేసిన నిల్వలు ప్రస్తుతం నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో ఉన్నట్లు ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో తగినన్ని నిల్వలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
రూ.1.5 - 3 లక్షలు పలుకుతున్న టొసిలిజుమాబ్