ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రాసేందుకు అర్హత కోసం ఈనెల 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లో అది జరగాల్సి ఉండగా కరోనా కారణంగా జులైలో నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నిర్ణయించటం తెలిసిందే. ఏప్రిల్‌లో కంటే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెయిన్‌కు దాదాపు 9లక్షల మంది దరఖాస్తు చేశారు.
అందులో ఎక్కువమంది హాజరయ్యే దిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుందా అన్న సందేహం అభ్యర్థుల్లో ఉంది. అది జరిగితే రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర పరీక్షలు జరుగుతాయని, దాన్ని రద్దుచేస్తే ఇక్కడా ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.
ప్రత్యేక పరిస్థితి ఇదీ...
వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఏదో ఒక ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించడమే మేలని 2006లో మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు కరోనా తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి కోర్టు నుంచి ఈ విద్యా సంవత్సరానికి మినహాయింపు కోరవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం ఏంటన్నదే వారికి అంతుపట్టకుండా ఉంది.
ఇంటర్ మార్కులే ఆధారం!
ప్రవేశ పరీక్షలు జరగకుంటే ఇంటర్‌మీడియట్ మార్కుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. తమిళనాడులో ఇప్పటికీ ఇంటర్ మార్కుల ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అదే చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇంటర్‌లోని ప్రధాన సబ్జెక్టులు(ఎంపీసీకి మూడు, బైపీసీకి 4)లో వచ్చిన మార్కులకు 25% వెయిటేజీ, ఎంసెట్ మార్కులకు 75% వెయిటేజీ ఇస్తున్నారు. 2007లో ఆచార్య దయారత్నం కమిటీ సిఫారసు ఆధారంగా వెయిటేజీ అమలుచేస్తున్నారు. 25% వెయిటేజీ చొప్పున పెంచుకుంటూ నాలుగేళ్లలో 100% ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రతిభనలా నిర్ణయించవచ్చా?
నాలుగేళ్ల క్రితం వరకు జేఈఈ మెయిన్‌లో ఇంటర్ మార్కులకు 40% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ మార్కులు అధికంగా ఇస్తున్నారని, దానివల్ల జేఈఈ మెయిన్‌లో ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మార్కుల కేటాయింపు ఉంటోందంటూ వెయిటేజీని సీబీఎస్‌ఈ రద్దుచేసింది.
ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో ఉత్తీర్ణులైన మొత్తం 2.60లక్షల మంది(జనరల్-రెగ్యులర్)లో 75% ఆపైన మార్కులు సాధించినవారు 1.53లక్షల మంది ఉన్నారు. అంటే 59% మంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపు విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే అది 80% దాటే అవకాశం ఉంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఏం చేద్దాం...!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టమేనని భావిస్తున్న ప్రభుత్వం వాటిని రద్దు చేయనున్నట్లు తెలిసింది. కరోనా తీవ్రవత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం... ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయపరమైన సమస్యలు రాకుండా అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకొని రద్దు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సైతం సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.