ganja smuggling : కొకైన్ , హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ, ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్ వంటి ఖరీదైన మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు.. సమయానికి అది లభించకపోతే గంజాయిని ఆశ్రయిస్తున్నారు. దీని రవాణాకు ప్రధానంగా హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకున్నాయి పలు ముఠాలు. దీనికి ప్రధాన కారణం.. పలు రాష్ట్రాలకు సరిహద్దులు కలిగి ఉండడం, రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉండడం, సహా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు ఎక్కువ ఉండడం, సహా పలు కారణాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.
ఎక్కడి నుంచి తెస్తున్నారు
Cannabis Trafficking :ఏపీలోని ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని సేకరిస్తున్నారు. అక్కడ కిలో గంజాయి క్వాలిటీని బట్టి రూ.8వేల వరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర దాటే కొద్ది దాని రేటు వేలల్లో పెరిగిపోతుంది. రైలు, రోడ్డు మార్గాల్లో ప్రధానంగా గంజాయిని తరలిస్తున్నారు. అందుకు కార్లు, లారీలు, సహా ప్రజా రవాణా వాహనాతో పాటు అంబులెన్సులు ఉపయోగించిన సందర్భాలు చూశాము. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా బోర్డర్ దాటించడంలో కొందరు నిష్ణాతులై ఉంటారు.
హైదరాబాద్ అడ్డాగా..
ganja transport from ap: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజాయిని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, కోంపల్లి, శేరిలింగంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అందుకోసం స్థానికంగా కొందరి ఏజెంట్ల సాయంతో పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడి నుంచి వాహనాలను మార్చి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ రకాలుగా బోర్డర్ దాటిస్తారు. కూరగాయలు, పండ్లు, పాలు, ఎరువులు తరలించే వాహనాలు.. ఇలా ఏ అవకాశాన్ని వదులుకోకుండా సరుకుని గమ్యస్థానానికి చేర్చుతున్నారు.
పక్కా ప్రణాళికతో..
గంజాయిని తలించడంలో స్మగ్లర్లు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ గంజాయి తరలించే వారు ఒళ్లంతో కళ్ల చేసుకుని వెళ్తుంటారు. పెద్ద మొత్తంలో గంజాయిని సాధారంగా లారీలలో రవాణా చేస్తుంటారు. ఆ లారీకి ఎస్కార్టుగా ముందు ఓ కారులో కొందరు వెళ్తారు. కారులో ఉన్న వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు లారీలో ఉన్నవారిని అలర్ట్ చేస్తూ ఉంటారు. లారీ కారు మధ్య కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ఉండేలా చూసుకుంటారు. టోల్గేట్లు, చెక్‌పోస్టులు, పోలీసుల తనిఖీలు ఇలా ప్రతి విషయాన్ని లారీలో ఉన్న వారికి చేరవేస్తుంటారు. కారులో వెళ్తున్న వారి నుంచి సమాచారం రాకున్నా.. వారి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చినా.. ప్రమాదం ఉందని స్మగ్లర్ల సిగ్నల్స్... ఈ విషయాలు ఇటీవల పట్టుబడిన ఓ ముఠాను విచారించగా బయటపడ్డాయి.