WhatsApp Fraud Calls with Foreign Numbers : ఈమధ్య కాలంలో అందరి నోట ఒకే మాట.. ఫ్రాడ్ కాల్స్. విదేశీ నంబర్లతో వీడియో, ఆడియో కాల్స్ చేసి ప్రజలను ఇబ్బందులలోకి తోసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్‌కు ఏమాత్రం స్పందించినా ఇబ్బందులు తప్పవు, అడ్డంగా బుక్కయిపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి నగరాల్లో చాలా మంది బాధితులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఫిర్యాదు చేస్తే నామూషీగా ఉంటుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనంగా ఉండిపోయారు.
WhatsApp Fake Calls with Foreign Numbers :ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇలాంటి కాల్స్ పట్ల సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. ఇలాంటి ఫోన్ నంబర్లను ఉపయోగించి స్పూఫింగ్ కాల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన యాప్ సాయంతో సైబర్ నేరగాళ్లు తమ అసలు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్లు చేయడం, మెసెజ్‌లు పంపించడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఫోన్ చేసినా వారికి ఫోన్ కలవదని చెబుతున్నారు పోలీసులు.
అభివృద్ధి చెందిన సాంకేతికతను ఉపయోగించి దేశ, విదేశాల్లో నేరగాళ్లు అక్కడి నుంచే ఇలాంటి పనులు చేస్తున్నారు. వాట్సాప్, మొబైల్ నంబర్లకు ఫోన్లు చేసి మాటలు కలుపుతారు. అమ్మాయిల గొంతుతో ఇంగ్లీష్, హిందీ భాషల్లో కన్వర్జేషన్ ప్రారంభిస్తారు. మంచి స్నేహాన్ని ప్రారంభించి, ఛాటింగ్ అంటూ ఆశ చూపుతారు. వాట్సాప్ ద్వారా నగ్న వీడియో కాల్స్‌తో వలపు వల విసురుతారు. ఇవతలి వ్యక్తి ఆ వీడియోలు చూస్తున్నట్లు అటు నుంచి వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను ఎరగా చూపించి బెదిరిస్తూ సొమ్ము కాజేస్తుంటారు.