How to React If Ragging Happens : ర్యాగింగ్.. ఒకప్పుడు పాఠశాల, కళాశాల అనే బేధం లేకుండా ప్రతి విద్యాలయంలో ఉండేది. దీనికి ఎంతో మంది విద్యార్థులు బలయ్యారు. అందుకే దీన్ని నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టాలు సైతం తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు కనిపించాయి. అంతా సక్రమంగా ఉంది... ఎక్కడా ర్యాగింగ్ లేదు అని అనుకున్న తరుణంలో.. వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంతో ఈ భూతం మళ్లీ తెరమీదకు వచ్చింది. ర్యాగింగ్ కారణంగా ఇటీవల ఇద్దరు మరణించారు.
వరంగల్ లో వైద్య విద్యనభ్యసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి... తనను సీనియర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆత్మహత్యకు యత్నించి మరణంతో పోరాడి చివరికి కన్ను మూసింది. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదువుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్నారని తాను చనిపోయే కొన్ని రోజుల ముందు తన కుటుంబ సభ్యలుకు చెప్పారు.
దీన్ని అరికట్టడానికి యూజీసీ, ఏఐసీటీఈ లాంటి పలు సంస్థలు అనేక రెగ్యులేషన్స్ తీసుకొచ్చాయి. 2021 లో యూజీసీ నియమించిన యాంటీ ర్యాగింగ్ సెల్ కు 511 ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు... ర్యాగింగ్ మళ్లీ పెరిగిపోతుంది అనడానికి. అయితే.. మీరు చేరిన కళాశాలలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తే ఇలా ఎదుర్కోండి..
1. ఓపికతో వేచి చూడండి లేదా తిరగబడండి :మీకు అభ్యంతరం లేనంత వరకు, ఇబ్బందికరంగా అనిపించనంత వరకు వారు చెప్పినవి చేయండి. ఓపికతో వేచి చూడండి. కొంత కాలానికి వాళ్లే కామ్ అయిపోతారు. లేదా.. ర్యాగింగ్ చేసిన ప్రారంభంలోనే తిరగబడండి. మీరేంటో చూపించండి. అలా అని గొడవలకు పోకుండా.. వారికర్థమయ్యేలా భయపడరని తెలిసేలా ప్రవర్తించండి.
2. ఫిర్యాదు చేయడం:ర్యాగింగ్ చేస్తే అది ఏ స్థాయిలో ఉందో చూడండి. రానురాను సమస్య తీవ్ర తరమైతే సంబంధిత యాజమాన్యానికి తెలియజేయండి. ప్రతి విద్యాసంస్థలో ర్యాగింగ్ నిరోధక విభాగం ఉంటుంది. వారికి ఫిర్యాదు చేయవచ్చు. వారు పట్టించుకోని పక్షంలో సమీప పోలీసు స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి. ఇలా కూడా కాకుంటే... నేరుగా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నంబర్ 1800 180 5522కు కాల్ చేయవచ్చు.