తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలా పూజించాలంటే! - PUJALU

దేవతలకే దేవుడు మహాదేవుడు.. గంగను తలపై మోసేవాడు గంగాధరుడు. పార్వతికి సగభాగం ఇచ్చిన అర్థనారీశ్వరుడు.. మూడు కన్నులవాడు ముక్కంటి.. విషాన్ని గొంతులో దాచుకున్న గరళకంఠుడు ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్న ఆ మహేశ్వరుడికి మహాశివరాత్రి అంటే ఎంతో ప్రీతికరం.

ఎలా పూజించాలంటే!

By

Published : Mar 4, 2019, 7:00 AM IST

హిందువుల పండుగల్లో అత్యంత ప్రముఖమైన పండుగ శివరాత్రి. నెలకు ఒకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి ఏడాదికోసారి మాత్రమే వస్తుంది. ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. మహాశివరాత్రిరోజు పరమశివున్ని నిష్టతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి బహుళ చతుర్థి, అర్థ నక్షత్రం రోజున లింగోద్భవం జరిగిందని శివపురాణంలో ఉంది. ఆరోజు శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించినా, శివ ప్రతిష్ట లేదా కల్యాణం చేసినా ఎంతో ముక్తిఫలం. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

ఒకరోజు శివుడిని పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు ఈ ఉత్సవం తనకెంతో ఇష్టమని ఆరోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాములలో పాలు, పెరుగు, నీరు, తేనెతో అభిషేకిస్తే తనకు ప్రీతి కలుగుతుందని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరోకటి లేదని పరమశివుడు బోధిస్తాడు.

పూజ ఎలా చేయాలంటే...

మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం పరుచుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టి పూలతో అలంకరించాలి. తెలుపు రంగు బట్టలు ధరించి శివుడు, పార్వతీదేవితో కలిసి ఉన్న ఫొటోకి లేదా లింగాకార ప్రతిమకు గంధం రాసి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ పర్వదినాన తప్పకుండా మారేడు దళాలు శివునికి సమర్పించాలి.

పసుపు లేదా తెలుపు రంగు పూలమాలతో పరమేశ్వరుడిని అలంకరించాలి. ఆ తర్వాత అరటిపళ్లు, జామకాయలు, తాంబులం, నైవేద్యంగా పెట్టి నిష్టతో పూజించాలి. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు శివనామ స్మరణ చేస్తూ పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details