తెలంగాణ

telangana

ETV Bharat / state

ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!

ధన త్రయోదశి... ఈ రోజు నుంచి దీపావళీ వేడుకలు ప్రారంభమవుతాయి. త్రయోదశి పర్వదినాన లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏం చేయాలి... అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటే ఏ విధంగా పూజ చేయాలి?

ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!

By

Published : Oct 25, 2019, 12:28 PM IST

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు. లక్ష్మీ కటాక్షం ప్రసాదించే పర్వదినమిది. ఈ రోజు నుంచే దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. నాటి ఉదయం లక్ష్మీదేవి భూమికి దిగివస్తుందని, అంతటా సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇంటిలో కొలువుదీరుతుందని నమ్ముతారు. అందుకే ధన త్రయోదశి నాడు వేకువజామునే ఇల్లూవాకిలీ శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిట అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దాలి.

మంగళకరంగా పూజ చేయాలి

ఇంటిలోని వారందరూ అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తమ పూజామందిరాన్ని మంగళకరంగా అలంకరించుకొని, లక్ష్మీపూజ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వెండి వస్తువులను, బంగారు ఆభరణాలను శుభ్రం చేసి పూజా మందిరంలో ఉంచి.. వాటినే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించాలి.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే

సంపదపై పవిత్రమైన భావన కలిగి ఉండాలి. ధనాన్ని సద్వినియోగం చేయడమే లక్ష్మీదేవి ఆరాధన. ఇందుకు ధన త్రయోదశినాడు శ్రీకారం చుట్టాలి. ఇలా సంకల్పించుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం వివరిస్తోంది.

మూడు రోజుల పాటు వేడుకలు

ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ‘గో త్రిరాత్ర వ్రతం’ నిర్వహిస్తారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి సేవ చేస్తారు.

దక్షిణం వైపు దీపం

ధన త్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంటిలో దక్షిణం వైపు దీపం పెట్టాలని పెద్దలు చెబుతారు. ఇలా దీపారాధన చేసిన వారికి అపమృత్యుదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

  • ధన త్రయోదశి ప్రత్యేకతలు
  • పండగ జరిగే మూడు రోజుల పాటు ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. దీపదానం చేయడం కూడా సంప్రదాయంలో భాగం. లక్ష్మీపూజ, దీపారాధన, దీపదానం, అపమృత్యుపరిహారం.. ఇవన్నీ ధన త్రయోదశి ప్రత్యేకతలు.

ABOUT THE AUTHOR

...view details