పదో తరగతి ఫలితాలను ఈనెల 20 వరకు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో జారీ చేసిన నేపథ్యంలో...అంతర్గత మదింపు పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటర్నల్ అసెస్ మెంట్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు నిర్ధరించాలని... ఎస్ఎస్సీ బోర్డుగా వ్యవహరించే ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని సర్కారు ఆదేశించింది.
గ్రేడ్ల లెక్కింపు ఇలా..
నాలుగు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా 20శాతం మార్కులను పాఠశాలలు మార్చి నెలలోనే బోర్డుకు ఆన్లైన్లో పంపించాయి. గతంలో ఫెయిలై ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థుల మార్కులు కూడా గతంలోనే బోర్డుకు చేరాయి. ఎఫ్ఏ మార్కులతో వాటిని విద్యా శాఖ అధికారులు పరిశీలించి నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికే బోర్డు వద్ద ఉన్న ఇంటర్నల్ మార్కులను ఐదింతలు చేసి.. వందకు లెక్కించి గ్రేడ్లు ఇస్తారు.