Telangana TRT Recruitment 2023 :తెలంగాణలో టీచర్ పోస్టుల ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి డీఎస్సీ/ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(TRT) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. డీఎస్సీ (TS DSC 2023)ద్వారా ప్రభుత్వ పాఠశాలలతో పాటు మునిసిపల్ స్కూళ్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ ఉపాధ్యాయులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే డీఎస్సీ/టీఆర్టీకి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు? వయోపరిమితి ఎంత? అప్లికేషన్ ఫీజు ఎంత? ఏఏ పత్రాలు అవసరం? ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Telangana DSC Notification 2023 :తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక.. ఈ పోస్టులకు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరిస్తారు. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ(TS Education Department) విడుదల చేసింది. అదే విధంగా అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలని సూచించింది.
డీఎస్సీ/ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) మొత్త పోస్టులు : 5,089
- అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు - 2575
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులు -1739
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు - 164
- లాంగ్వేజ్ పండిట్ పోస్టులు - 611ఉన్నాయి.
ఈ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 43, హనుమకొండలో 53 ఖాళీలు ఉన్నాయి.
డీఎస్సీ నోటిఫికేషన్ అర్హతలు(TS TRT Eligibility Criteria) : పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి(TS DSC Age Limit) :ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకునే అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. అదేవిధంగా మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు కల్పించింది.
అప్లికేషన్ ఫీజు(TRT Application Fee) : తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ప్రతి ఉద్యోగం కోసం వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ప్రతి పోస్టుకు వేర్వేరు అప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుందని తెలంగాణ విద్యాశాఖ వివరించింది.