కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో రద్దుచేసినట్టే ఆంధ్రప్రదేశ్లోనూ.. పదోతరగతి పరీక్షలను రద్దు చేశారు. గతంలో జులై 10- 17 వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా... వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. పదోతరగతితో పాటు ఇంటర్ మొదటి, రెండో ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో అందరినీ పాస్ చేయాలని నిర్ణయించినట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షకు చెల్లించిన ఫీజును వాపసు చేస్తామన్న ఆయన... ప్రతిభ ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందని వివరించారు.
వివరాలు లేవు
ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఫార్మెటివ్- 4 మార్కులు ఇప్పటివరకూ నమోదుకాలేదు. పదో తరగతిలో ఈ ఏడాది రెగ్యులర్‌గా 6,30,804 మంది, ఒకసారి ఫెయిలైన 7,800 మంది విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం హాల్ టికెట్లు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో అంతర్గత మార్కులు తొలగించినందున... పాఠశాల విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి పూర్తి మార్కుల వివరాలను సేకరించలేదు. ఇప్పటికీ 15.08 శాతం మంది మార్కుల వివరాలు పాఠశాల విద్యాశాఖ వద్ద లేవు. ఫార్మెటివ్-4 మార్కుల జాబితాను ఇంతవరకూ సేకరించలేదు. ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఇవ్వకపోవటంతో విద్యార్థుల మార్కులను ఉపాధ్యాయులు నమోదు చేయలేదు.
ఎలా ఇస్తారు?
2019- 2020 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షలు 4, సమ్మెటివ్ ఒకటి, ప్రీ ఫైనల్ పరీక్షలు పెట్టారు. ఫార్మెటివ్‌లో ఒక్కో సబ్జెక్టు 50 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ఈ లెక్కన నాలుగు ఫార్మెటివ్‌లు 200 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులు, మొత్తం 300 మార్కులను 100 మార్కులకు కుదించి గ్రేడ్లు ఇస్తారా? లేదంటే కేవలం ఫార్మెటివ్‌లు 200 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పదో తరగతిలో ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల అధారంగా గ్రేడ్లు ఇస్తే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిన వారికి గ్రేడ్ పాయింట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలపై తర్జనభర్జన
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 5,7,230 మంది హాజరు కాగా... వీరిలో 59శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,35,655 మంది హాజరు కాగా.. వీరిలో 63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు రద్దైనందున ఇప్పుడు మిగతా వారందరూ ఉత్తీర్ణులైనట్లే. మొదటి ఏడాది వృత్తి విద్య కోర్సుల పరీక్షలను 39,135 మంది రాయగా.. వీరిలో 59 శాతం మంది, ద్వితీయ సంవత్సరంలో 26,713 మంది పరీక్షలు రాస్తే... 48 శాతం ఫెయిలయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరూ ఉత్తీర్ణులు కానున్నారు. వీటితో పాటు డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్, బీటెక్ పరీక్షలు నిర్వహించాలా.. వద్దా? అనే దానిపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నందున పరీక్షల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై సోమవారం అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఆ తర్వాత పరీక్షలపై కీలక ప్రకటన చేయనుంది.
ఇవీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ