భూ యాజమాన్య హక్కుల బదిలీల్లో లంచాల పర్వం ఆగట్లేదు. కొత్త పాసుపుస్తకాల పంపిణీలో క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది వసూళ్లకు పాల్పడ్డారని, రెవెన్యూశాఖ ప్రక్షాళన తప్పదంటూ ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా ఆ శాఖలోని కొందరి తీరు మారకపోగా.. అక్రమ వసూళ్లతో ప్రజలను పీడిస్తూనే ఉన్నారు.
పారదర్శకత లోపమే శాపం..
రెవెన్యూ శాఖలో అక్రమాలకు బీజం వేస్తోంది పారదర్శక వ్యవస్థ లేకపోవడమే. యాజమాన్య హక్కుల విషయంలో క్షేత్రస్థాయి సిబ్బందిదే అన్నిచోట్లా ఆధిపత్యం. మ్యుటేషన్ ప్రక్రియకు నిర్దుష్టమైన గడువు ఉన్నా చాలాచోట్ల వివిధ కారణాలతో దస్త్రాలు కదలడం లేదు. వారసత్వ బదిలీ, తప్పిపోయిన సర్వే నంబర్లు చేర్చడం, కొత్త పాసుపుస్తకాల జారీ తదితర ప్రక్రియల్లో లోపాయికారీగా ఆమ్యామ్యా అందనిదే పలు జిల్లాలు, మండలాల్లో దస్త్రం కదలడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఒక పత్రం పొందాలని దరఖాస్తు చేసుకున్న భూయజమానికి తన పని ఎంతవరకూ వచ్చిందో తెలిపే ట్రాకింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల నయానో భయానో ఇచ్చి పని పూర్తి చేయించుకునేందుకు ఆరాటపడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం జోరు ఉన్నచోట కొందరు వ్యాపారులు అక్రమ పద్ధతులకు తెర తీస్తున్నారు. ‘ధరణి’ పేరుతో కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా 2018 నుంచి అమల్లోకి రావడమే లేదు. ఆన్‌లైన్‌లో సర్వే, ఖాతా నంబర్లు లేని రైతులు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.