రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కాంగ్రెస్ భాగస్వామ్య యూపీఏ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో... రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ... ప్రజలకు నిజాలు తెలిసేలా చేయడం కోసం కాంగ్రెస్ ఈ కార్యాచరణకు పూనుకుంది.
ఎవరెవరు - ఎక్కడెక్కడ
ఎస్ఎల్బీసీ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు, పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు, పరిగి లక్ష్మీదేవీపల్లి పంప్‌హౌస్ వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలు, ఏలూరు జలాశయం వద్ద మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, కరివేన జలాశయం వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద వంశీచంద్ రెడ్డిలు దీక్షలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే మంగళవారం నేతల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు.