లాక్డౌన్ కారణంగా హాస్టళ్లలోని విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారని... ఇలాంటి సమయంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సాగర్ హైవే హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హస్తినాపురం డివిజన్ ఓంకార్ నగర్ కాలనీలో హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించారు.
2నెలలుగా లాక్డౌన్ తో హాస్టళ్లు మూతపడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయారు. రూపాయి ఆదాయం లేకపోగా... భవనం అద్దె, కరెంట్ బిల్లులు కట్టడమే గగనంగా మారిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను చిన్న పరిశ్రమలుగా గుర్తించి ఆదుకోవాలని పలువురు హాస్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
''లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి సమయంలో భవనాల అద్దెలు చెల్లించలేకున్నాం. కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యే వరకు భవన యజమానుల నుంచి అద్దె విషయంలో వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. కరెంటు బిల్లులు, ట్రేడ్ లైసైన్స్ వంటి టాక్స్లను మాఫీ చేయాలి.''