Horticulture Officer Exam Postponed by TSPSC: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమిషన్.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
రద్దయిన వాటికి కొత్త తేదీలు ఎప్పుడు..?: ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసు తరువాత సిట్ అధికారుల సూచనలు మేరకు టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. తాజాగా వీటి లిస్ట్‌లోకి హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష కూడా చేరింది.
ఏప్రిల్, మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిపింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తారు. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు.