Urban Farming Training: హైదరాబాద్ నాంపల్లిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నగర సేద్యంపై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. స్వయం సమృద్ధి లక్ష్యంగా 'మన ఇల్లు - మన కూరగాయలు పథకం' కింద అవగాహన కార్యక్రమం కొనసాగింది. జంటనగరాల నుంచి బహుళ అంతస్తుల భవనాల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ఔత్సాహిక కుటుంబాలు, మిద్దెతోటల నిర్వాహకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖాళీ జాగాలు, గేటెడ్ కమ్యూనిటీలతోపాటు డాబాలు, బాల్కనీలు, బహుళ అంతస్తుల భవనాలపై ఇంటి అవసరాలకు సరిపడా... రసాయన అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎలా పండించుకోవాలో నిపుణులు అవగాహన కల్పించారు.
ప్రతి నెల రెండో శనివారం, నాలుగో ఆదివారం... ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇంటి పంటల సాగుదారులు, మిద్దెతోటల నిర్వాహకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 2012 నుంచి కొనసాగుతున్న ఈ అవగాహన ఇటీవల మంచి సత్ఫలితాలు ఇస్తోంది. డాబా లేదా నేల స్వభావం, విత్తనం, మొక్కలు, కుండీల ఎంపిక, సేంద్రీయ ఎరువులు, జీవామృతం తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ఉత్పత్తిపై ప్రయోగాత్మక శిక్షణనిచ్చారని పలువురు పేర్కొన్నారు. శాస్త్రీయ, ప్రయోగాత్మక శిక్షణతోపాటు ఔత్సాహికులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యానశాఖ ఉచితంగా అందజేసింది. పాలకూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర, బచ్చలికూర, టమాట, బెండ, బీర, చిక్కుడు విత్తనాలు తక్కువ ధరల్లో విక్రయించారు.