Roof Garden: హైదరాబాద్‌లో మిద్దె తోటల సంస్కృతి పెరిగిపోతోంది. సొంతింటి డాబాలు, బాల్కనీలు, బహుళ అంతస్తుల భవనాలపై కూరగాయల సాగు చేస్తున్నారు. 40 వేలకుపైగా డాబాలు, అపార్ట్‌మెంట్లపై మిద్దె తోటల సాగు విజయవంతంగా సాగుతోంది. ఆయా కుటుంబాలు అవసరాలకు తగ్గట్టు రసాయనాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల సాగు చేస్తున్నారు. జంటనగరవాసుల విజ్ఞప్తి మేరకు ఇవాళ నాంపల్లిలోని ఉద్యాన శాఖ శిక్షణ సంస్థలో మిద్దె తోటల నిర్వహణపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నట్లు సంచాలకులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రేపోమాపో రాష్ట్రంలోకి ప్రవేశించనున్న తరుణంలో మిద్దెతోటల సాగు కొత్తగా ప్రారంభించబోయే ఔత్సాహికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యాన శాఖ నగర సేద్యం విభాగం అధికారి మంగ పేర్కొన్నారు.
Roof Garden: మిద్దెతోట సాగుపై పెరుగుతున్న ఆసక్తి.. శిక్షణ ఇస్తున్న ఉద్యానశాఖ
Roof Garden: ఇంటి పంటల సాగుపై ఆసక్తి పెరుగుతోంది. మిద్దె తోటల సాగుకు జనం ముందుకొస్తున్నారు. డాబాలపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకుంటూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జంటనగరవాసులకు ఇవాళ మిద్దె తోటల నిర్వహణపై ఉద్యానశాఖ శిక్షణనివ్వనుంది.
ప్రపంచవ్యాప్తంగా కలుషిత సాగు ద్వారా ఉత్పత్తైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల ఏటా 10 లక్షల మందికిపైగా జనం చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది. అధిక మొత్తంలో రసాయన ఎరువులు వినియోగించి పండించిన ఉత్పత్తులు తినడం వల్ల క్యాన్సర్, రక్తపోటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. అందువల్ల ప్రతి పౌరుడు విధిగా రసాయనాలు వాడని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 2012 నుంచి మిద్దె సాగును పెద్ద ఎత్తన ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. నగరవాసులకు తరచూ శిక్షణనిస్తోంది.
జంటనగరాల్లో ఆసక్తిగల ఇంటి యజమానులు, మహిళలు, యువత... నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ సంస్థ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల రెండో శనివారం, నాలుగో ఆదివారం ఇంటి పంటల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న శిక్షణకు హాజరుకావచ్చు.