తెలంగాణ

telangana

ETV Bharat / state

Union Cabinet Expansion: తెలుగు ఎంపీల ఆశలు.. మంత్రి పదవులపై కలలు - తెలుగు ఎంపీలు వార్తలు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Union Cabinet Expansion) నేపథ్యంలో తెలుగు ఎంపీలు.. మంత్రి పదవులు వస్తాయేమోనని ఆశలు పెంచుకున్నారు. మొత్తం 8 మంది ఎంపీలకుగాను ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పుడు సోయం బాపు రావుకు అవకాశం వరించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

telugu mp's hopes
తెలుగు ఎంపీల ఆశలు

By

Published : Jul 7, 2021, 11:59 AM IST

Updated : Jul 7, 2021, 12:52 PM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Union Cabinet Expansion) కు రంగం సిద్ధమైంది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం.

తెలుగు ఎంపీల ఆశలు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Union Cabinet Expansion) నేపథ్యంలో తెలుగు ఎంపీలూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం భాజపా తరఫున తెలంగాణ నుంచి నలుగురు లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావును కలిపితే ఏపీ నేపథ్యం ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరుతుంది. మొత్తం 8 మంది ఎంపీలకు గాను ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రస్తుతం మిగతా వారూ మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు.

ఎంపీ బాపురావుకు అవకాశం!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలేమీ లేనందున రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవచ్చని రాజ్యసభ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. గిరిజనులకు అవకాశం కల్పించాలనుకుంటే ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావు (Soyam Bapu rao)కు అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు అధిష్ఠానం నుంచి ఇంతవరకూ ఫోనేమీ రాలేదని సమాచారం.

ఇప్పటివరకూ ఫోన్​ రాలేదు

తెలుగుదేశం నుంచి వెళ్లి చేరేటప్పుడు తగు ప్రాధాన్యం ఇస్తామని భాజపా అధిష్ఠానం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏపీలోని కర్నూలు నేత టీజీ వెంకటేష్‌ (TG Venkatesh) మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కర్నూలులోనే ఉన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ఫోన్లూ రాలేదని చెప్పారు. సీఎం రమేశ్‌, సుజనాచౌదరి, జీవీఎల్‌ నరసింహారావు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు (Soyam Bapu rao)లు దిల్లీలో ఉన్నారు. ఇందులో కొందరు పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాల్లో హాజరుకావడానికి వస్తే, మరికొందరు వ్యక్తిగత పనులమీద దిల్లీలో ఉంటున్నట్లు చెప్పారు.

ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం..

ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో యూపీ నుంచి ఉన్న 9 మందిలో నలుగురైదుగురికి స్థానచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. రీటా బహుగుణ జోషికి అవకాశం వస్తే అదే సామాజికవర్గానికి చెందిన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకి ఉద్వాసన ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. యూపీ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నవారిలో జోషితో పాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, పంకజ్‌ చౌదరి, రాంశంకర్‌ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదీచూడండి:నేడే మంత్రివర్గ విస్తరణ- పూర్తైన కసరత్తు!

Last Updated : Jul 7, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details