Hon Hai Fox Conn MOU With Telangana Government: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'హోన్ హై ఫాక్స్ కాన్' (Hon Hai Fox Conn) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి.. రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. ఈ ఒప్పందంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి.
Hon Hai Fox Conn MOU With Government: ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇదే ముఖ్యమైనదని ప్రభుత్వం తెలిపింది. ఒకే సంస్థ ద్వారా లక్ష మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని వ్యాఖ్యానించింది. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించిందని హర్షం వ్యక్తం చేసింది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యంగ్ ల్యూకి అందజేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం.. ప్రగతిభవన్‌లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.