తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టకాలంలో...కడుపునింపుతున్నారు! - కరోనా రోగుల ఇబ్బందులు

ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇంటిల్లిపాదీ కొవిడ్‌ బారిన పడితే ఆప్యాయంగా వండిపెట్టేదెవరు? నేనున్నా అంటూ భరోసా ఇచ్చేదెవరు?  చేతిలో నాలుగు డబ్బులున్నవాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేస్తారు... చేయడానికి పని లేక... తినడానికి తిండిలేక ఇబ్బందిపడే పేదాసాదా సంగతేంటి? సరిగ్గా ఇలాంటి వారికోసమే మేమున్నాం అంటూ మానవత్వానికి ఊపిరిలూదే ప్రయత్నం చేస్తున్న అమృతమూర్తులు వీళ్లంతా..

homemakers-provides-free-food-for-corona-patients
కష్టకాలంలో...కడుపునింపుతున్నారు!

By

Published : Apr 29, 2021, 10:14 AM IST

కుందన్‌దేవి... వ్యాధి కారణంగా వండుకోలేని నిస్సహాయుల ఆకలి గురించే ఎక్కువగా ఆలోచించారు. ఓవైపు అనారోగ్యం... మరోవైపు ఆకలి బాధ కుటుంబాలని ఎలా కుంగదీస్తున్నాయో తెలుసుకున్నాక వారికి ఉచితంగా ఇంటి ముంగిటకే ఆహారాన్ని అందించాలనుకున్నారు. బిహార్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన ఆమె తన ఇద్దరు కుమార్తెల సాయంతో ఈ మహత్కార్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు..

కుందన్‌దేవి


‘మా బంధువొకరికి కొవిడ్‌ సోకింది. ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉంటూ వండుకోవడానికి పడిన కష్టం విన్న తర్వాత ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి నుంచే ఈ సేవను ప్రారంభించాం. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాల కోసమని దాచిన డబ్బుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒకరి ఆకలి తీర్చడానికి మించిన గొప్ప మాధవ సేవ మరొకటి ఉండదు కదా! సోషల్‌మీడియా సాయంతో కొవిడ్‌ కారణంగా ఐసోలేషన్‌లో ఉంటున్న వారి వివరాలు, చిరునామాలను సేకరిస్తున్నాం. వాళ్ల కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి ఆహారం తయారుచేస్తున్నాం. వాటిని ప్యాక్‌ చేసి మా అమ్మాయిలు అనుపమ, నీలిమలు ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు. అనుపమ ఓప్రైవేటు సంస్థలో ఉద్యోగిని. నీలిమ ఎంబీఏ పూర్తిచేసి పోటీ పరీక్షలు రాస్తోంది. మాసేవ గురించి తెలుసుకుని కొందరు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తుంటారు. కానీ మేం తీసుకోవడం లేదు. మీరూ మరో పదిమందికి ఆహారాన్ని ఉచితంగా ఇవ్వండని వారిచ్చే నగదును తిరస్కరిస్తున్నా. ప్రతిరోజు కనీసం పాతిక కుటుంబాలకు ఈ ఆహారాన్ని అందిస్తున్నాం'. -కుందన్‌దేవి

జాగ్రత్తలు తీసుకుని స్కూటీపై వెళ్లి

రోజుకి వెయ్యిమంది ఆకలి తీరుస్తూ...

నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అరుణ బహుగుణ హైదరాబాద్‌లో రోటీబ్యాంకు ప్రారంభించి నిత్యం ఎంతో మంది ఆకలితీరుస్తున్నారు.

అరుణ


‘గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి లాక్‌డౌన్‌ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. వలస కూలీల కాళ్లు చెప్పుల్లేక బొబ్బలెక్కాయి. అలాంటి వారికి ఏదైనా సాయం చేయాలనిపించింది. ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే పాదరక్షలు, ఆహారం వంటివి పంపారు. వాటిని పంచిపెట్టాక.. ముంబయిలో నా సీనియర్‌ శివానందన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రోటీబ్యాంకు గుర్తుకొచ్చింది. 30 లక్షలమంది ఆకలి తీర్చిన ఆ సంస్థ మార్గదర్శకంలో నేనూ అడుగులు వేశాను. ఎంతోమంది సహృదయంతో స్పందించి విరాళాలు, వంట సామగ్రి అందించారు. అలా గత ఏడాది ఆగస్ట్‌లో మా రోటీ బ్యాంక్‌ ప్రారంభమైంది. మొదట్లో మా ఇంట్లోంచే వండి అవసరం అయిన వారికి స్వయంగా వెళ్లి అందించేదాన్ని. కానీ వందలాది మందికి వండిపెట్టడానికి కావాల్సిన సదుపాయాలు ఇంట్లో లేకపోవడంతో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో రెండు వంటశాలలని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే వేడిగా, తాజాగా వండి భోజనాలు అందించడం మొదలుపెట్టాం. పప్పు, అన్నం, ఒక కూర ఉండేలా చూస్తాం. దాతలు ఎవరైనా స్వీట్లను ఇస్తే వాటినీ ఈ మెనూలో చేర్చుతాం. పోలీసుశాఖ సాయం తీసుకుని బాధితులు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లి ఆహారపదార్థాలను అందిస్తున్నాం. రోజూ ఒకే ప్రదేశానికి పరిమితం కాకుండా జాగ్రత్తపడతాం. కారణం వాళ్లు మాపై ఆధారపడేలా చేయకూడదనే. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకు వచ్చి కూలీ పనులు చేసే చాలామంది తమ జీతాన్ని ఇళ్లకు పంపించి తాము మాత్రం ఒక కప్‌ చాయ్‌... బన్నుతో రోజులు వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి మేమందించే ఆహారం ఇచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. రోజుకి ఆరువందల నుంచి వెయ్యిమందికి ఆహారాన్ని అందిస్తున్నాం. నాక్కూడా కొన్ని నెలల క్రితం కొవిడ్‌ రావడంతో ఇప్పుడు వారంలో కొన్ని రోజులు మాత్రమే వెళ్లగలుగుతున్నా'.-అరుణ

ఆహారం అందించి.. ఆనందం నింపుతున్నారు

మందులు ఇంటికే...
నిఖిత

నిఖిత ఆహ్య కుటుంబం గతేడాది కరోనా బారిన పడింది. దీంతో వాళ్లు నిత్యావసర వస్తువులు, మందుల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ స్వీయ అనుభవమే భువనేశ్వర్‌కి చెందిన నిఖితను ఆలోచించేలా చేసింది. ఎవరైనా నిత్యావసర వస్తువులు, మందులకు ఇబ్బంది పడుతుంటే తనకి సమాచారం ఇవ్వాలని కోరింది. మరుసటిరోజుకే దాదాపు 20కిపైగా సందేశాలు ఆమెకు అందాయి. ఓప్రైవేటు విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించే నిఖిత తన స్నేహితుల సాయాన్ని తీసుకుని అవసరం అయిన వారికి వస్తువులు, మందులను కొనుగోలుచేసి ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. దీంతోపాటు కిచిడీ, కూరలు, పప్పు, అన్నం, పెరుగువంటి ఆహారపదార్థాలను రోగులకు ఉచితంగా అందిస్తోంది. ఇందుకయ్యే సొమ్ముని తాము పొదుపుచేసుకున్న దాంట్లోంచే వెచ్చిస్తున్నారు వీరంతా.

ఇదీ చూడండి:వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు విడుదల

ABOUT THE AUTHOR

...view details