తెలంగాణ

telangana

ETV Bharat / state

Home minister: షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలి - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో నిర్మిస్తున్న వివిధ పోలీస్ కార్యాలయాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. వివిధ జిల్లాల్లో జరుగుతున్న నిర్మాణాలపై మంత్రి సమీక్షించారు. నిర్మాణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

home minister, mamahood ali
హోం మంత్రి, మహమూద్ అలీ

By

Published : Jun 23, 2021, 8:45 AM IST

Updated : Jun 23, 2021, 9:00 AM IST

రాష్ట్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాలు, కమిషనరేట్ల నిర్మాణ పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గద్వాల, సూర్యాపేట, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, భూపాల​పల్లి, వనపర్తి, మహబూబాబాద్, రామగుండంలో నిర్మిస్తున్న భవనాలను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలని హోంమంత్రి ఆదేశించారు.

సిద్దిపేట సీపీ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం ఆధునిక మౌలిక సదుపాయాలతో 50,000 అడుగుల విశాలమైన విస్తీర్ణంతో నిర్మించడం వల్ల చక్కగా ఉన్నాయని అన్నారు. మిగిలిన భవనాల నిర్మాణం కాలపరిమితి ప్రకారం పూర్తి కావాలని, డీపీవో, సీపీవో భవనాల నిర్మాణంలో ఉన్న ప్రాంగణాల్లో అధికారుల నివాసాల కోసం ఎనిమిది చొప్పున భవనాలను నిర్మించాలని సూచించారు. అంచనాలతో పాటు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి... అనుమతి కోసం పంపాలని అన్నారు.

మేడిపల్లిలో రాచకొండ కమిషనర్ కోసం కొత్త భవనం నిర్మాణానికి సంబంధించిన పనులను అంచనాలు ఆమోదించిన వెంటనే ప్రారంభిస్తామని హోంమంత్రి చెప్పారు. ములుగు, నారాయణపేట డీపీవోల కోసం కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఖరారు చేసి పంపాలని అధికారులను కోరారు. వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం కోసం కేటాయించిన భూమి, కాంపౌండ్ వాల్ మొదలైన వాటి కోసం జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది పంపే ప్రతిపాదనలను వీలైనంత త్వరగా ఖరారు చేస్తామని మంత్రి చెప్పారు.

నిర్మాణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. తాను నిర్మాణ స్థలాలను సందర్శిస్తానని చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:high court: కొత్తగూడేనికి చెందిన ఓ వ్యక్తిపై హైకోర్టు మండిపాటు

Last Updated : Jun 23, 2021, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details