తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం ఐసోలేషన్.. ఇరుకు ఇళ్లలో బాధితుల పరేషాన్! - home isolation problem in telangana

కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారు, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారు నలిగిపోతున్నారు. ఇంట్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వ్యాధిగ్రస్థులకు పాలుపోని పరిస్థితిని తెచ్చిపెడుతోంది. వైరస్‌ సోకిన కొందరు బాధితుల పరిస్థితిపై మంగళవారం 'ఈటీవీ భారత్-ఈనాడు' పరిశీలన చేసింది. వారితో ఫోన్‌లో మాట్లాడగా పలు విషయాలు వెలుగు చూశాయి.

home isolation problem in telangana
హోం ఐసోలేషన్ వల్ల ఇరుకు ఇళ్లలో బాధితుల ఇబ్బందులు

By

Published : Jul 8, 2020, 7:23 AM IST

కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారు.. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో అద్దెకుంటూ ఉద్యోగాలు చేసుకునే వారిని చిక్కుల్లోకి నెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బాధితులు సొంతింట్లో ఉండేందుకు కూడా ఇరుగు పొరుగువారు అంగీకరించడం లేదు. దీంతో పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చి వారిని తరలిస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం బాధితులను ఇబ్బందులపాలు చేస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిన కేసుల విషయంలో ఐసోలేషన్‌ పర్యవేక్షణ తీరు సరిగా ఉండటం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైరస్‌ సోకిన కొందరు బాధితుల పరిస్థితిపై మంగళవారం 'ఈటీవీ భారత్-ఈనాడు' పరిశీలన చేసింది. వారితో ఫోన్‌లో మాట్లాడగా పలు విషయాలు వెలుగు చూశాయి.

హోం ఐసోలేషన్‌పై శీతకన్ను

హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితుల ఇళ్లలో సదుపాయాల గురించి యంత్రాంగం నిశితంగా దృష్టిసారించడం లేదనేది క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే అవగతమవుతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒకరిద్దరికి కరోనా వచ్చినా ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. కరోనా రోగులు ప్రత్యేకంగా ఉండేందుకు అనువైన ఏర్పాట్లు ఆ గృహంలో ఉన్నాయా అనే అంశానికి ప్రాధాన్యమివ్వడం లేదనేది స్పష్టమవుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక గదులకు పరిమితం చేసి మిగతా కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనే విషయంపై పరిశీలన అధికారులు లోతుగా ఆరా తీయడం లేదు. పలువురు బాధితుల గృహాల్లో తగిన సదుపాయాలు లేవని గుర్తించినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని కొందరు పేర్కొంటున్నారు. ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో వేర్వేరు గదుల్లోనే ఉంటున్నా.. వైద్యారోగ్య సిబ్బంది రోజూ పర్యవేక్షిస్తున్నా.. ఆసుపత్రుల్లో తీసుకునే స్థాయిలో అవగాహన కల్పించలేకపోతున్నారని పలు జిల్లాలకు చెందిన బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువమంది వైరస్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

నగరంలో చికిత్సలకు గోప్యత

కరోనా సోకినా పెద్దగా లక్షణాలు లేనివారు ఇంటి నుంచే చికిత్స పొందొచ్చని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు సూచిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ బాధితులకు హోం ఐసోలేషన్‌ నుంచే చికిత్సలు చేస్తోంది. నగరంలో ఇరుకు గల్లీలు, కాలనీలు, బస్తీలు, బహుళ అంతస్తుల సముదాయాలు ఉన్నచోట వైరస్‌ సోకిన వ్యక్తులు తమ ఉనికి వెలుగులోకి రాకుండా చూసుకుంటున్నారు. పొరుగు వారితో ఇబ్బందులు ఎదురవుతాయని ఫోన్లో సంప్రదించి మందులు వాడుతున్నారు. వైద్య సిబ్బంది కూడా వారి సెల్‌కు సంక్షిప్త సమాచారం అందించి ఊరుకుంటున్నారు. బాధితులే బయట మందులు కొనుగోలు చేసుకుంటున్నారు.

''నేను, నా స్నేహితుడు వైరస్‌బారిన పడ్డాం. అతనికి దగ్గు ఎక్కువగా వస్తుండటంతో గాంధీలో చేరాడు. దగ్గు కొద్దిగా వస్తుండగా వైద్యసిబ్బంది సూచనలతో ఇంట్లోనే ఉంటున్నా. వైద్యులు వాట్సప్‌లో మందుల వివరాలు పంపుతుండటంతో మా దగ్గరి బంధువుల సాయంతో తెప్పించుకుని వాడుతున్నా. చలిజ్వరం కూడా వచ్చి తగ్గిపోయింది. ఉంటున్నది ‘సింగిల్‌ బెడ్‌ రూం హౌస్‌’ కావడంతో మా కుటుంబంతో సర్దుకోలేక చివరికి సమీప బంధువుల ఇంటికి పంపాల్సి వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే బిల్లు చెల్లించే స్థోమత లేదు.'' అంటూ నగరంలో పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వివరించారు.

'నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నా. పాజిటివ్‌ అని తేలగానే గొంతులో వెలక్కాయపడినట్లు అయింది. గాంధీకా, ప్రైవేటు ఆస్పత్రికా.. ఎటువెళ్లాలా అని వైద్య సిబ్బందిని సంప్రదిస్తే ఇంటి నుంచి చికిత్స చేయించుకోవచ్చని సూచించారు. చిన్న ఇల్లు కావడంతో... నేను ఇంటికి వెళ్లకముందే భార్యాపిల్లలను స్నేహితుల సహకారంతో గ్రామానికి పంపించా. వైద్య సిబ్బందిని ఫోన్లో సంప్రదిస్తూ నిత్యం మందులు వేసుకుంటున్నా. మిత్రులు సరుకులు, మందులు తెచ్చి ఇంటి ముందున్న గేటుకు తగిలించి వెళ్తే తీసుకుని నెట్టుకొస్తున్నా. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. భార్యా పిల్లలకు దూరంగా... నగరంలో నరకంలో ఉన్నట్లు ఉంటున్నా..' అంటూ ఒక వైరస్‌ బాధితుడు ఫోన్లో తన బాధలు వివరించారు. పలువురు ఇలా ఒంటరిగా ఇంట్లో ఉంటూ చికిత్సలు పొందుతున్నారు.

ఐసోలేషన్‌ కేంద్రం..బాధల మయం

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలోని ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రంలో 26 రోజులుగా ఉంటున్నా. మొన్నటి వరకు సిబ్బంది దూరం నుంచే జ్వరం ఎలా ఉందంటూ అడిగారు తప్ప సరిగా పట్టించుకోలేదు.’’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 12 మంది రోగులున్నారు. వీరికి అందించే సదుపాయాలపై ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే తీరులో బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో సౌకర్యాలు, పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ బాధితులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details