Home Guard Ravinder Passed Away :హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు రవీందర్ మృతి(Homw Guard Ravinder Dead) చెందారు. వెంటనే మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈనెల 5న గోషామహల్లో పెట్రోల్ పోసుకుని రవీందర్ నిప్పంటించుకున్నారు. జీతం గురించి అడగడానికి వెళ్లే అధికారులు కించపరిచారని భార్యకు చెప్పారు. కార్యాలయం నుంచి బయటకు వచ్చి పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నారు. తీవ్రగాయాలైన హోంగార్డును ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి పోలీసులు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు కృత్రిమ శ్వాసను అందించారు. పరిస్థితి విషమించడంతో రవీందర్ తుది శ్వాస విడిచారు.
ఆ ఇద్దరి పోలీసులే చంపేశారంటూ భార్య సంధ్య ఆందోళన :హోంగార్డు రవీందర్‌ను ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందునే పెట్రోల్ పోసి తగులబెట్టి చంపారని రవీందర్ భార్య సంధ్య ఆరోపణ చేశారు. తన భర్తతో మాట్లాడిన తర్వాతనే చంపేశారని విమర్శించారు. తన ఫోన్ మొత్తం అన్‌లాక్ చేసి డేటా డిలీట్ చేశారని వివరించారు. ఇప్పటివరకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేయలేదని.. సీసీ ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. తన భర్తను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హోంగార్డుగా 17 ఏళ్లు నిబద్ధతతో విధులు నిర్వహించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
అసలేం జరిగింది : హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఠాణాలో పదేళ్లకు పైబడి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన అవసరాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని.. అందుకు సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల 5వ తేదీన చెల్లించేలా ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే ఈ నెల జీతం ఇంకా పడకపోవడంతో హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లాడు. ఎందుకు సెలరీ ఇంకా రాలేదని అక్కడ ఉన్న కార్యాలయ సిబ్బందిని అడిగారు. వారు చెక్కులు బ్యాంకులకు పంపించామని.. ఒకటి, రెండు రోజుల్లో జీతం ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.