ఇళ్లలో వచ్చే ఘనవ్యర్థాలను కంపోస్టింగ్ చేసేలా ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి అపార్టుమెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, గృహ, వాణిజ్య సముదాయాలు వంటి ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు వచ్చే ప్రాంతాల్లో... అక్కడే కంపోస్టింగ్ చేపట్టేలా చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడే కంపోస్టింగ్ చేయడం ద్వారా డంప్ సైట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లపై భారం తగ్గుతుందని భావిస్తోంది. ఇందుకోసం అన్ని నగర, పురపాలికల్లో హోంకంపోస్టింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని గతంలోనే స్పష్టం చేసింది. అధికారులు, ఇంజినీర్లు, సూపర్ వైజర్లు, ఇన్ స్పెక్టర్లతో పాటు స్థానిక రిసోర్స్ పర్సన్లు, కాలనీ సంక్షేమ సంఘాలను ఇందులో భాగస్వాముల్ని చేయాలని తెలిపింది.
ముందుగా శిక్షణ
మొదటి దశలో ఆయా పట్టణాల్లోని కనీసం పది శాతం గృహ, నివాస సముదాయాలు, 50శాతం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్యసముదాయాల్లో కంపోస్టింగ్ లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రీసోర్స్ పర్సన్స్‌కు తగిన శిక్షణ ఇవ్వాలని... వారికి పనితీరు ఆధారంగా ప్రతి ఇంటి నుంచి 150 రూపాయలు, వాణిజ్య సముదాయాలు 250 రూపాయలు ఇవ్వాలని తెలిపింది. ఆయా పట్టణాల్లో హోంకంపోస్టింగ్ చేపట్టేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకోసం రీసోర్స్ పర్సన్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో వార్డుకు ఒక్కో సీఆర్పీని నియమించనున్నారు. ముందుగా వారికి శిక్షణనిస్తారు. ఆ తర్వాత వారి నుంచి సీఆర్పీలకు శిక్షణనిస్తారు. ఇప్పటికే తొమ్మిది పట్టణాల్లో ఈ శిక్షణ పూర్తైంది. త్వరలోనే మరో 44 పట్టణాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.