పిండారబోస్తున్నట్లు కాస్తున్న పౌర్ణమి వెన్నెల కాంతుల్లో జరుగుతున్న సమావేశంలో ముందుగా ఇంద్ర ధనస్సు లేచి సభ్యులందరికీ నమస్కరించి.. ఇలా చెప్పుకొచ్చింది. ఈ రోజు పాల్గుణ పౌర్ణమి.. దీనినే డోలికా పూర్ణిమ అని... హోలికా పూర్ణిమ అని అంటారని చెప్పింది. ఇంతలో ఓ తుమ్మెద లేచి... ఓ అవునా అయితే ఇవాళ హోలీ పండుగ అన్నమాట.. అసలు ఈ పండుగ ఎలా వచ్చింది.. ఎలా చేసుకోవాలని అడగగా.. ఇంద్ర ధనస్సు ఇలా వివరించింది. రాధాహృదయాధిపతి అయిన చిన్ని కృష్ణుడిని ఊయలలో వేసిన రోజుగా బంగాల్లో డోలికోత్సవాన్ని చేసుకుంటారు. ఈ పౌర్ణమితో పాల్గుణమాసం ముగిసి వసంత మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజునే వసంతోత్సవం పేరుతో రంగులు చల్లుకుంటారు. భారతదేశంలో పాల్గుణ పౌర్ణమనినాడు హోలీ పండుగ జరుపుకుంటారని చెప్పింది.
ఇంతలో సభలో ఉన్న కోకిల లేచి ఓ అవునా.. ఈ వేడుకంటే నాకు చాలా ఇష్టం.. గతేడాది వేరే దేశానికి వలస వెళ్లినప్పుడు అక్కడ కూడా చేసుకున్నారు. మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్లో రంగులమయంగా జరుపుకున్నారు. హోలీ అంటే అగ్ని అని అర్థమంట... అని ముగించింది. పక్కనే కారుమబ్బు ఆ ప్రసంగాన్ని కొనసాగిస్తూ అవునవును హిరణ్యకశ్యపుని సోదరి అయిన హోలిక అంతమైన రోజున ఈ వేడుకను జరుపుకుంటారు. ప్రహ్లాదుడుని మంటల్లో వేయబోయి తానే దహనమైందని పురాణాల్లో ఉంది. అందుకే చాలా ప్రాంతాల్లో హోలికను దహనం చేస్తుంటారు. గతేడాది నుంచి ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనాసురుడుని తగలబెడుతున్నారని తాను చూసినదాన్ని కోకిల వివరించింది.
ప్రసంగాన్ని ఉత్సాహంగా వింటున్న ఓ పాము లేచి తనకు తెలిసిన కథను ఇలా చెప్పింది. మా నాగవంశం పెద్దలు హోలీ వేడుక గురించి ఓ కథ చెప్పారు. అదేమిటంటే.. పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవిపై దృష్టి మరల్చేలా మన్మథుడు నీలికంఠుడిపై పూలబాణం సంధిస్తాడు. తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపుడై మన్మథుడుని భస్మంచేశాడని.. అలా కోరికలు దహింపచేసిన రోజును హోలీగా చేసుకుంటారని చెప్పింది. అందుకే ఆరోజున మన్మథుడి బొమ్మకు నిప్పంటిస్తారంట..
కొమ్మలపై కులసాగ కూర్చున్న నెమలి సభలోకొచ్చి ఎన్ని కథలున్నా మానవాళి ఘనంగా చేసుకునే పండుగ హోలీ. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు చలితో వణికిన నరులు.. ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. అందుచేతనే ఔషధాల నుంచి తయారు చేసిన రంగులను చల్లుకోవడం వల్ల వ్యాధులు తగ్గుతాయనే వాదనను కొట్టిపారేయలేం అని చెప్పి తిరిగి కొమ్మపైకెళ్లిపోయింది.