తెలంగాణలో హోలీ వేడుకలు, హోలీ సంబురాలు 2021 రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేసి సందడి చేశారు. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో మనవళ్లతో కలిసి హోలీ ఆడారు. హైదరాబాద్ బేగంబజార్‌లోని పలు మర్వాడీ కుటుంబాలు ఆనవాయితీగా వస్తున్న హోలీ సంబురాలను ఇళ్ల లోపలే ఉండి జరుపుకున్నారు. ఇతర వ్యక్తులతో కాకుండా కేవలం కుటుంబసభ్యులు మాత్రమే రంగులు పూసుకుంటూ ఆనందించారు.
ఏక్ మిని కథ హోలీ
ఏక్ మిని కథ చిత్రబృందం హోలీ పండుగలో మునిగితేలారు. కథానాయక, నాయికలు సంతోష్ శోభన్, కావ్య తాపర్... యూట్యూబర్లతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. సినిమా పాటలకు నృత్యాలు చేశారు. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. నిర్మాణసంస్థ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు.
హోలీ రంగులు.. డీజీ స్టెప్పులు
ఖమ్మంలో చిన్న పెద్ద తేడాలేకుండా హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఉత్సహంగా గడిపారు. నిజామాబాద్‌లో వీధివీధినా రంగులు చల్లుకుంటూ నగరవాసులు వేడుకలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు, యువతీయువకులు రంగులు అద్దుకొని సందడి చేశారు. అనంతరం నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. కరీంనగర్‌లో రాజస్థానీ యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... తిలకం దిద్దుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగుతూ సంబురాలు చేసుకున్నారు.
విషాద ఘటనలు
పండుగరోజు పలు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవిందు తండాలో శివశంకర్ అనే యువకుడు... హోలీ వేడుకల అనంతరం స్నానం కోసం బావిలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్‌లో ఆకాశ్ అనే బాలుడు రంగులు చల్లుకున్న అనంతరం... స్నానం చేసేందుకు చెరువుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు.
ఇదీ చదవండి:కేసీఆర్ అండ, నాన్న కృషే నన్ను గెలిపిస్తాయి: నోముల భగత్