తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త నిబంధనలతో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం! - హెచ్​ఎండీఏ తాజా వార్తలు

కొత్త లేఅవుట్ నిబంధనలు హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం తీసుకురానుంది. రూ. 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవాకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని భారీ లేఅవుట్లు, టౌన్‌టిష్‌లకు సంబంధించిన అప్రోచ్‌ రోడ్లు 100 అడుగుల వెడల్పు ఉండాల్సిందేనంటూ తాజాగా ఉత్తర్వులిచ్చారు. అంతకంటే తక్కువ ఉంటే అదనంగా డెవలెప్‌మెంట్‌ ఛార్జీలను చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఇప్పుడు హెచ్‌ఎండీఏకు వరంగా మారింది.

కొత్త నిబంధనలతో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం!
కొత్త నిబంధనలతో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం!

By

Published : Jul 11, 2020, 10:15 AM IST

కొత్త లేఅవుట్‌ నిబంధనలు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు కాసుల వర్షం కురిపించనున్నాయి. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న వందలాది అర్జీలకు మోక్షం కలగనుంది. రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు అధికారుల అంచనా. అదనపు డెవలెప్‌మెంట్‌ ఛార్జీల ద్వారా సమకూరే నిధులను ఆయా ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

హెచ్‌ఎండీఏ పరిధిలోకొచ్చే ఏడు జిల్లాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు అనుమతి తీసుకోవాలి. లేదంటే అక్రమ లేఅవుట్‌గా పరిగణించి చర్యలు తీసుకుంటారు. సుమారు ఏడాది నుంచి రెండెకరాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న లేఅవుట్లకు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇస్తోంది. 3 ఎకరాలు, అంతకంటే ఎక్కువగా ఉన్న లేఅవుట్లకు అప్రోచ్‌ రోడ్డు 100 అడుగుల వెడల్పు ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటం, పెరుగుతున్న ట్రాఫిక్‌, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోవడంపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 100 అడుగుల కంటే తక్కువగా ఉంటే ఏం చేయాలనే అంశంపై స్పష్టత లేక 200 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

రూ.100 కోట్ల వరకు రావొచ్చని అంచనా

హెచ్‌ఎండీఏ పరిధిలోని భారీ లేఅవుట్లు, టౌన్‌టిష్‌లకు సంబంధించిన అప్రోచ్‌ రోడ్లు 100 అడుగుల వెడల్పు ఉండాల్సిందేనంటూ తాజాగా ఉత్తర్వులిచ్చారు. అంతకంటే తక్కువ ఉంటే అదనంగా డెవలెప్‌మెంట్‌ ఛార్జీలను చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఇప్పుడు హెచ్‌ఎండీఏకు వరంగా మారింది. గతంలో ఓ స్థిరాస్తి వ్యాపారి 4.1 ఎకరాల్లో లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేయగా అధికారులు పెండింగ్‌లో పెట్టారు. అప్పుడు డెవలెప్‌మెంట్‌ ఛార్జీల కింద రూ.35 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. తాజా నిబంధనలతో రూ.72 లక్షలు కట్టాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. అంటే.. ఒక్కో దరఖాస్తుపై సుమారు 50 శాతం ఆదాయం అదనంగా సమకూరుతుందన్న మాట. ఈ లెక్కన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై రూ.100 కోట్ల వరకు వచ్చే అవకాశముంది.

ముందుకొస్తారా.. లేదా..?

తాజా నిబంధనలతో స్థిరాస్తి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నవి పక్కన పెడితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. ముందుకొస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదనంగా డెవలెప్‌మెంట్‌ ఛార్జీలను చెల్లించడంతో పాటు అప్రోచ్‌ రోడ్డు ఎంత తక్కువగా ఉంటే అంత స్థలాన్ని ఇరువైపులా వదిలేయాలి. ఉదాహరణకు.. 4.1 ఎకరాల లేఅవుట్‌లో అప్రోచ్‌ రోడ్డు కోసం ముప్పావు నుంచి ఎకరా వరకు కేటాయించాలి. ఈ లెక్కన చూస్తే తాము భారీగా నష్టపోవడం ఖాయమంటూ అర్జీదారులు హెచ్‌ఎండీఏ అధికారుల వద్ద వాపోతున్నారు.

ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details