Hmda Greenary On National Highways: పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తోంది. వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్‌కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటికి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులు సుందరీకరణలో.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక పాత్రను పోషిస్తోంది.
భవిష్యత్ తరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. హెచ్ఎండీఏ ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని పెంచి పోషిస్తోంది. వరంగల్ నేషనల్ హైవే వెంట ప్రస్తుతం.. యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న.. మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీని జనగామ వరకు పొడిగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్‌ను తలపించేలా పచ్చదనాన్ని పెంచి పోషించాలని.. సీఎం కేసీఆర్ పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖను ఆదేశించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు.. వరంగల్ నేషనల్ హైవే వెంట జనగామ వరకు దాదాపు రూ.15.04 కోట్ల వ్యయంతో మల్టీలేయర్ ప్లాంటేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే వెంట 64 కిలోమీటర్లు.. రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే వెంట.. 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తయ్యాయి.
సెంట్రల్ మిడెన్ గ్రీనరీ.. మల్టీలేయర్ ప్లాంటేషన్:శ్రీశైలం హైవే వెంట.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్లు.. సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు జాతీయ రహదారి ఆరాంఘర్ నుంచి షాద్‌నగర్ వరకు 25 కిలోమీటర్లు.. శామీర్‌పేట్ నుంచి గజ్వేల్ వరకు దాదాపు 39 కిలోమీటర్ల వరకు చేపట్టిన సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీలేయర్ ప్లాంటేషన్ నిర్వహిస్తోంది.