ORR Controversy Latest Updates : హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లీజు వివాదం రోజురోజుకి తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు, నేతల మధ్య సాగుతున్న ఈ వివాదం ఇప్పుడు హెచ్ఎండీఏ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే లాగా మారిపోయింది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు ఇవ్వగా.. దానిపై ఆయన ఘాటుగానే స్పందించారు. తనకు ఇచ్చిన లీగల్ నోటీసును ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి హెచ్చరించారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ నగర మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అర్వింద్‌కుమార్ సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవుటర్ రింగ్ రోడ్డుసగ భాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. అధిక ఆదాయం వచ్చే ఆవకాశం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7వేల 380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్‌ను కట్టబెట్టారని ద్వజమెత్తారు.
HMDA responded to Revanth Reddy comments on ORR Issue : దీనిపై తాజాగా హెచ్ఏండీఏ సైతం స్పందించింది. ఓఆర్‌ఆర్ టీఓటీ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డికి జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. అధికారులు, సంస్థ పనితీరుపై అపోహలు, రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడం, ప్రత్యేకంగా అధికారుల పేర్లను ప్రస్తావించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ధేశిత మార్గదర్శకాలకు లోబడి, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ పనిచేస్తుందన్న విషయాన్ని ఎంపీ మరవరాదని హితవు పలికారు.